మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (15:10 IST)

షర్మిల పార్టీ రిజిస్టర్ కాలేద‌ట‌... అన్న వైసీపీనే అడ్డుపుల్ల‌!

తెలంగాణాలో వై.ఎస్. ష‌ర్మిల వెంట న‌డుస్తున్న వారికి ఎన్నిక‌ల క‌మిష‌న్ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీని రిజిస్ట్రేషన్  కాలేదని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దానికి అడ్డుపుల్ల వేసింది ఎవ‌రో కాదు... అన్న‌వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌నే కావ‌డం ఇక్క‌డ విశేషం. ఆ పార్టీ అభ్యంతరం మేరకు షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ ను నిలుపుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది.               

 
అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారానికి భారత ఎన్నికల సంఘం ఈమేరకు రాత పూర్వకంగా సమాధానమిచ్చినట్లు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ మీడియాకు తెలిపారు. వైయస్ షర్మిల పార్టీని రిజిష్టర్ చేయలేదని, మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని షర్మిలకు లేఖ కూడా రాసినట్లు ఎన్నికల సంఘం తెలిపిందని  చెప్పారు.            
 
 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు తమ పార్టీ పేరును పోలి  ఉందంటూ,ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి,సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
 
అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ వైయస్ షర్మిల స్థాపించతలపెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీ కూడా తమ పార్టీ పేరును పోలి ఉందంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ త‌రుణంలో భారత ఎన్నికల సంఘం షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసినట్లు వెల్లడించింది. వైయస్ షర్మిలకు మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని ఈ నెల 3వ తేదీన లేఖ రాసినట్లు ఎన్నికల సంఘం మహబూబ్ బాషాకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపింది. దీంతో వైయస్ షర్మిల అభిమానులు షాక్‌కు గురయ్యారు.           
 
 
ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల కార్యక్రమాలను సైతం మొదలుపెట్టారు. భారత ఎన్నికల సంఘం పంపిన లేఖతో వైఎస్ షర్మిల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. షర్మిలకు వైయస్సార్ పేరుతోనే పార్టీ కావాలంటే, మహబూబ్ బాషాతో రాజీ కావడం తప్ప ఇతర మార్గం కనిపించడం లేదు. లేకపోతే వైఎస్ఆర్ పేరు లేకుండా వేరే పేరు పెట్టుకోవడం ఆమెకు ప్రత్యామ్నాయంగా  మిగిలింది. తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ పేరుతో భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మాత్రమే అని మహబూబ్బాషా, అబ్దుల్ సత్తార్ వెల్లడించారు. నిజమైన వైఎస్ఆర్ అభిమానులు పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వారు స్పష్టం చేశారు.