గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (19:38 IST)

చిట్ ఫండ్ స్కామ్: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్‌ అరెస్ట్

Malla vijaya prasad
చిట్ ఫండ్ స్కామ్ కేసులో విశాఖ అధికార వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్‌ను ఒడిసాలోని భువేశ్వర్ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వెల్ఫేర్ సంస్థ పేరుతో మళ్ల విజయప్రసాద్ ఆంధ్రప్రదేశ్, ఒడిసా, చత్తీస్‌ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ వ్యాపారాలు నిర్వహించారు. 
 
డిపాజిటర్లను మోసం చేసిన రూ.1200 కోట్ల కుంభకోణంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిసాలో డిపాజిట్దారులకు సక్రమంగా చెల్లింపులు జరపకపోవడంతో ఫిర్యాదులు అందాయి. 
 
దీనిపై ఒడిసా సీఐడీ పోలీసులు 2019లో విజయప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 420, 406,467, 468, 471, మరియు 120 (బీ) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సోమవారం విశాఖ వచ్చిన ఒడిసా సీఐడీ పోలీసులు స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. 
 
అనంతరం కేజిహెచ్ లో వైద్య పరీక్షలు చేయించి విశాఖ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అనుమతితో విజయప్రసాద్‌ను ఒడిసాకు తీసుకువెళ్లారు. 2016లో వందల కోట్ల చిట్ ఫండ్ మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కేసులకు సంబంధించి ఐదు రాష్ట్రాల్లో 33 ప్రైవేటు సంస్థలు, కంపెనీ యాజమాన్యాలపై సీబీఐ సోదాలు జరిపింది. 
 
మళ్లా విజయ ప్రసాద్‌తో సహా అనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. నాడు మళ్లా ప్రసాద్ నివాసంలో సీబీఐ రూ.44.9 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.