మంగళవారం, 19 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 జూన్ 2020 (21:25 IST)

సాయి దత్త పీఠంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఎడిసన్: అమెరికాలో న్యూజెర్సీ సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దత్త పీఠంలో జూన్ 21 న ఉదయం, సాయంత్రం 2 సెషన్స్ నిర్వహించింది. స్వయంగా పీడియాట్రీషియన్, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ అయిన డా. విజయ నిమ్మ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా ఎస్.డి.పి సూర్య యోగ పేరుతో 40 మందికి డా. విజయ ఎంతో అభిరుచితో గత 5 సంవత్సరాలుగా ప్రతీ రోజూ యోగా నేర్పిస్తూ తనవంతుగా కమ్యూనిటీ సేవ చేస్తున్నారు.
 
ఎస్.డి.పి గురుకులంలో కూడా చిన్న పిల్లలకు యోగా  నేర్పిస్తున్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి ముమ్మరంగా ఉన్న ఈ సమయంలో యోగా ఆవశ్యకతను అందరికీ తెలియచేసి మనలో రోగనిరోధక శక్తి పెంపొదించుకోవటానికి అవసరమైన ఆసనాలపై అవగాహన పెంపొందిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ తరగతులను ఉచితంగా నిర్వహిస్తూ, అందరూ యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని, అదే తనకు ఇచ్చే గురుదక్షిణ అని, బాబాపై తనకున్న భక్తిని, గౌరవాన్ని చాటుకున్నారు.
భారతీయ యోగా యావత్ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే మంత్రంలా మారిందని సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి అన్నారు. ప్రపంచానికి యోగాను అందించిన భారతదేశంలో మనం పుట్టినందుకు నిజంగా ఎంతో గర్వపడాల్సిన అంశం అన్నారు. అలానే మనం మన సంస్కృతిలో భాగమైన యోగాను విస్మరించకూడదని.. యోగా ద్వారా శారీరక, మానసిక బలం పెరుగుతుందని తెలిపారు.
 
యోగా గొప్పతనం ఇప్పుడు యావత్ ప్రపంచం గుర్తిస్తుందన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పుడు యోగా  ప్రధానమైన అస్త్రమని అన్నారు. ఇది మనలో రోగనిరోధకశక్తిని పెంచుతుందన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుని ఆలయంలో కొంతమందితో యోగాసనాలు వేయించి, ఆన్లైన్‌లో కూడా మిగతా వారికి కూడా ఆ ఆసనాల విశిష్టతను కూడా వివరించారు.