సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:15 IST)

రక్తపు మడుగులో ఎన్నారై భార్యాభర్తలు ... కత్తితో ఒకరినొకరు పొడుచుకున్నారు..

అమెరికాలో భారత్‌కు చెందిన దంపతులు అనుమానాస్పదరీతిలో మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా శుక్రవారం పేర్కొంది. ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర బీద్‌ జిల్లాకు చెందిన బాలాజీ భారత్‌ రుద్రవర్‌కు(32) ఆర్తితో 2014లో వివాహమైంది. అనంతరం 2015లో ఉద్యోగరీత్యా వీరు అమెరికాకు వెళ్లారు. న్యూజెర్సీలోని నార్ద్‌ ఆర్లింగ్టన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. 
 
యూఎస్‌లోని ఓ ప్రముఖ భారత ఐటీ సంస్థంలో బాలాజీ ఐటీ నిపుణుడిగా ఉద్యోగం చేస్తుండగా.. భార్య గృహిణి. ఈ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉండగా ప్రస్తుతం ఆర్తి ఏడు నెలల గర్భవతి. అయితే అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం బాలాజీ కుమార్తె ఇంటి బాల్కనీలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
 
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లగా.. లివింగ్‌ రూమ్‌లో భార్యాభర్తలిద్దరూ రక్తపు మడుగుల్లో విగతా జీవిలుగా కనిపించారు. బాధితులిద్దరి శరీరంపై బలమైన కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే బాలాజీ తన భార్యను కత్తితో పొడిచి అనంతరం తను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటారని యూఎస్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. 
 
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, రీపోర్టులు వచ్చాక మృతికిగల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కాగా దంపతుల మృతిపై మహారాష్ట్రలో ఉంటున్న తమ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి న్యూజెర్సీలోని బాలాజీ స్నేహితుల సంరక్షణలో ఉంది.