సాయి దత్త పీఠంలో శ్రీలంక ఉగ్ర దాడి అమరులకు నివాళి
సౌత్ ప్లైన్ఫీల్డ్: ఈస్టర్ సండే రోజు మన భారతదేశానికి పొరుగు దేశమైన శ్రీలంక... బాంబుల మోతతో దద్దరిల్లింది. ఐసిస్ ఉగ్రవాదులు కొలంబో లోని ఎనిమిది చోట్ల బాంబులు పేల్చడంతో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయపడ్డారు.
మూడు చర్చిలు, నాలుగు హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడికి తెగబడ్డారు. దీంతో ఎల్‌టీటీఈ తుడిచి పెట్టుకుపోయిన పదేళ్ల తర్వాత లంక మళ్లీ నెత్తురోడింది. ఈ విపత్కర సమయంలో శ్రీలంక దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ప్రగాఢ సంతాపం తెలియచేసింది సాయి దత్తపీఠం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబాని ప్రార్ధించింది.
ఈ సందర్భంగా న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలకవర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు రాణి ఊటుకూరు అమరులైన వారికి ఘన నివాళులర్పించారు.
ఫ్రాంక్లిన్ టౌన్షిప్ నుండి శ్రీలంకకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హఛ్చి మాట్లాడుతూ ఉగ్ర దాడిని అందరూ, అన్ని మతాలవారూ ఖండించాలని శ్రీలంక ప్రజల యెడల సాయిదత్త పీఠం నిర్వహించిన ఈ క్రొవ్వొత్తి దీప ప్రదర్శన, మౌన ప్రదర్శనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ విషయాన్ని న్యూ యార్క్‌లో శ్రీలంక అంబాసిడర్‌కు తెలియపరుస్తానని చెప్పారు. సుమారు 200 మంది భక్తులు క్రొవ్వొత్తి ప్రదర్శనతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు.