అక్షయ తృతీయ రోజున పెరుగన్నం దానం చేస్తే?
అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసే వస్తువులు రెట్టింపు అవుతాయి. అందుకే ఈ రోజున బంగారం కొనాలనుకుంటారు. అయితే బంగారం కొనాలనే కాదు.. మనం నిత్యావసర వస్తువులను కూడా అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయొచ్చు.
అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఖరీదైన వస్తువును కొనుగోలు చేయలేరు. దీంతో నిరుత్సాహపడక్కర్లేదు. మనకు ఎంతో ఉపయోగపడే వస్తువులను మనం కొనుగోలు చేయవచ్చు. ఆ రోజున ఉప్పు, బియ్యం, కొత్త బట్టలు, చిన్న పాత్రను కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రతి నెలా కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయాల్సి వుంటుంది. వాటిని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు. ఇలా చేస్తే సుసంపన్నం ప్రాప్తిస్తుంది.
అక్షయ తృతీయ రోజున అష్టలక్ష్మీ అనుగ్రహం పొందడానికి, ఇంట కుబేర పూజ చేస్తే, అష్టైశ్వర్యాలను కూడా పొందవచ్చు. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల మరణభయం తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అన్నదానం చేయడం ద్వారా ప్రమాదాల నుంచి గట్టెక్కవచ్చు.
ఇంకా పేద విద్యార్థుల విద్యకు మనం సహకరిస్తే, మన కుటుంబంలోని పిల్లల చదువు మెరుగుపడుతుంది. ఇంకా బలహీనులకు సహాయం చేస్తే మరుసటి జన్మలో రాజయోగం జీవితం ఉంటుంది. దుస్తులను దానం చేయడం వల్ల వ్యాధులు నయం అవుతాయి.
పండ్లను దానం చేయడం వల్ల ఉన్నత స్థానాలు లభిస్తాయి. మజ్జిగ, పానకం సమర్పిస్తే విద్యాబలం పెరుగుతుంది. ధాన్యాలను దానం చేయడం వల్ల అకాల మరణం వుండదు. పెరుగన్నం దానం చేయడం ద్వారా పాప విమోచనం జరుగుతుంది. అలాగే పితృదేవతల పూజ ద్వారా పేదరికాన్ని తొలగించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.