శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (12:38 IST)

శివరాత్రి: బిల్వపత్రాలను మరిచిపోవద్దు.. (video)

ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి మహిమ గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో యిష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెపుతాడు. శివుడు చెప్పిన నియమం ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. 
 
దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగరణ ఉంటారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణం చెప్తోంది. 
 
ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు  'బిల్వ' మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. 
 
శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పండితులు చెప్తున్నారు.

వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. బిల్వం ఇంటి ఆవరణంలోని  ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తూర్పున ఉంటే సౌఖ్యం. పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షిణం వైపు వుంటే ఆపదలు నివారించబడుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.