ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సిహెచ్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (17:23 IST)

మహాశివరాత్రి ఫిబ్రవరి 21, శివరాత్రి గురించి మహాశివుడు ఏం చెప్పాడో తెలుసా?

ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.
 
మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాలమందికి తెలియదు. 'రా' అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద - రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది. 
 
హే రాత్రే అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. 
 
పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు.