క్రిమినల్స్‌కు పార్టీలో చోటెందుకు కల్పించారు : సుప్రీంకోర్టు
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు తేరుకోనిషాకిచ్చింది. తమతమ పార్టీల్లో నేర చరిత్ర కలిగిన రాజకీయ నేతల వివరాలను 48 గంటల్లో పార్టీల వెబ్‌సైట్లలో ఉంచాలని ఆదేశించింది. అలాగే, ఇలాంటి క్రిమినల్స్‌కు పార్టీలో ఎందుకు చోటుకల్పించారని కోర్టు సూటిగా ప్రశ్నించింది.
రాజకీయల్లో క్రిమినల్స్ పెరుగుతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఎటువంటి నేతలపై ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు పార్టీలో చేర్చుకున్నారో అన్న అంశాలను తమ తమ వెబ్‌సైట్లలో పొందుపరుచాలని కోర్టు తన తీర్పులో రాజకీయ పార్టీలను ఆదేశించింది.
అలాగే, సోషల్ మీడియా, స్థానిక పత్రికల్లో కూడా నేర చరిత్ర కలిగి ఉన్న ప్రజాప్రతినిధుల గురించి రాజకీయ పార్టీలు వెల్లడించాలని కోర్టు సూచించింది. రానున్న 72 గంటల్లో ఆ వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
అభ్యర్థుల ఎంపిక అనేది మెరిట్ ఆధారంగా ఉండాలని, కానీ గెలుపు శాతం ఆధారంగా కాదని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ రాజకీయ పార్టీలు నేర చరిత్ర కలిగిన నేతల వివరాలు ఇవ్వలేకపోయినా, లేక ఎన్నికల సంఘం తమ ఆదేశాలను అమలు చేయలేకపోయినా.. దాన్ని కోర్టు ధిక్కరణగా భావిస్తామని సుప్రీం హెచ్చరించింది.