శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (19:25 IST)

తులసీ వ్రతం... 26 శుక్రవారాలు ఇలా చేస్తే? (video)

తులసీ వ్రతాన్ని 26 శుక్రవారాలు ఇలా ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ప్రతి శుక్రవారం ఉదయం తలస్నానం చేసి తులసీ చెట్టుకు మూడు ప్రదక్షణలు మూడు నమస్కారములు చేసి అక్షతలను తల మీద ధరించాలి. అంతేగాకుండా తులసీ చెట్టు వద్ద మట్టి ప్రమిదెతో దీపారాధన చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు వుంచాలి. ఉద్యాపన రోజున 26 జతల అరిసెలు తయారు చేసుకోవాలి. 
 
ఉద్యాపన రోజున 13 జతల అరిసెలు నైవేద్యంగా తులసమ్మకు నివేదించాలి. ఎనిమిదేళ్ల వయస్సుగల ఆడపిల్లలను పిలిచి కొత్త రవికెలిచ్చి 13 జతల అరిసెలు వాయనం ఇవ్వాలి. ఉద్యాపన రోజున మాత్రం తులసీ షోడశోపచారపూజ చేయాలి. ఈ రోజున 26 పుస్తకాలు దానంగా ఇవ్వాలి. పూజ కాగానే తులసీ తీర్థము స్వీకరించాలి. 
 
తులసి - స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు.
 
ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.
 
తులసి చెట్టు నుండి దళాలను మంగళ , శుక్ర , ఆది వారములలో, ద్వాదశి , అమావాస్య , పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు . ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది.
 
తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి.