ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:49 IST)

తెలంగాణలో బతుకమ్మ పండుగ.. ఎలా చేస్తారంటే?

Bathukamma
బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. వర్షాకాలంలో చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాదు, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. ఈ పువ్వులతో బతుకుమ్మను చేస్తారు. 
 
బతుకమ్మ పండుగ ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలవుతుంది. దీన్ని తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఇది నవరాత్రులకు ముందు రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ పండుగను చాలా వేడుకగా జరుపుకుంటారు. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యమైన రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వేడుకగా చేసుకుంటారు. ఈ 9 రోజులు ప్రతి గడపకు పండుగ కళ వస్తుంది. 
 
అక్కాచెల్లెలు అంతా ఒక దగ్గరకు చేరుకుని కలిసి, ఆడి, పాడుతారు. మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను వెనక్కి తీసుకుని, మహిళలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటారు. మహిళలు దుస్తులు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేస్తారు.  
 
తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే... ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ,  నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మను పూజిస్తారు.