గురువారం, 7 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 ఆగస్టు 2025 (16:07 IST)

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

murder
తనతో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌తో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఆ వివాహిత జీర్ణించుకోలేకపోయింది. ఈ వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు భర్తను కోరింది. కానీ, ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విచక్షణ మరిచిన భార్య.. భర్తను కర్రతో బలంగా కొట్టింది. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆమె పడక గదిలోకి వెళ్లి.. ఆత్మహత్య లేఖ రాసిపెట్టి, తన ఎనిమిదేళ్ల కుమారుడు కళ్లెదుటే ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజ్‌కోట్‌కు చెందిన ముకేశ్ పార్మర్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన అహ్మదాబాద్‌లో తనతో పాటు విధులు నిర్వహించే ఓ లేడీ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ముకేశ్ భార్య సంగీతకు తెలియడంతో వారి మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఈ సంబంధాన్ని వదులుకోవాలని ఆమె పలుమార్లు భర్తను కోరింది. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో సోమవారం కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆ సమయంలో వారి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. తల్లిదండ్రుల గొడవ చూసిన బాలుడు భయంతో వణికిపోయాడు. 
 
ఈ గొడవ మరింతగా ముదిరిపోవడంతో విచక్షణ మరిచిపోయిన సంగీత.. తన భర్తను కర్రతో బలంగా కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆమె పడక గదిలోకి వెళ్లి సూసైడ్ లేఖ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఓ వైపు తండ్రి రక్తపు మడుగులో పడివుండగా, మరోవైపు గదిలో నుంచి అమ్మ ఎంతకూ బయటకు రాకపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు ఇరుగుపొరుగువారిని పిలిచాడు. వారి వచ్చి చూడగా అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.