బాలాపూర్ గణపతి లడ్డూ ధర ఎంతో తెలుసా?
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతి యేటా ఎంతో ఆసక్తిని రేకెత్తించే గణపతి లడ్డూ వేలం పాట ఈ సారి కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. తన పాత రికార్డును తానే బద్ధలు కొడుతూ ఈ యేడాది ఏకంగా రూ.35 లక్షల భారీ ధర పలికింది. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది.
హైదరాబాద్ నగరంలోని కర్మన్ ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ ప్రతిష్టాత్మకమైన లడ్డూను దక్కించుకున్నారు. ఈ యేడాది జరిగిన వేలం పాటలో మొత్తం 38 మంది పోటీపడ్డారు. ఈ వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. చివరకు లింగాల దరశరథ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత యేడాది ఈ లడ్డూ రూ.30.01 లక్షలకు అమ్ముడుపోగా, ఆ రికార్డను ఈ యేడాది సునాయాసంగా అధికమించింది. గత యేడాది కొలను శంకర్ రెడ్డి గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు.
కాగా, బాలాపూర్ లడ్డూ వేలం సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. అప్పట్లో కేవలం రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం పాట... దశాబ్దాలు గడిచేకొద్దీ లక్షల్లోకి చేరి సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ లడ్డూను దక్కించుకుంటే శుభం కలుగుతుందని వ్యాపారంలో వృద్ధి వుంటుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం పోటీ తీవ్రంగా ఉంటుంది.