శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 18 మార్చి 2017 (21:44 IST)

ఆ ముగ్గురికీ వివస్త్రయై వడ్డన చేసేందుకు వచ్చిన పతివ్రత....

బ్రహ్మ మానస పుత్రుడగు అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ మహాసాధ్వి. పతివ్రతా శిరోమణి, ఆమె ప్రభావమును దేవతలు త్రిమూర్తులతో నివేదించి ఆమె సంకల్పము ఎట్లో సృష్టిక్రమములట్లే సాగిపోగలదని తమ ఆందోళనమును వింతవార్తగ నివేదించిరి.

బ్రహ్మ మానస పుత్రుడగు అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ మహాసాధ్వి. పతివ్రతా శిరోమణి, ఆమె ప్రభావమును దేవతలు త్రిమూర్తులతో నివేదించి ఆమె సంకల్పము ఎట్లో సృష్టిక్రమములట్లే సాగిపోగలదని తమ ఆందోళనమును వింతవార్తగ నివేదించిరి.
 
అనసూయదేవి పాతివ్రత్య ప్రభావమును పరీక్షింపాలనుకుని త్రిమూర్తులు భిక్షువుల రూపముల దాల్చి అత్రిమునీంద్రుని ఆశ్రమమును చేరిరి. ఆ సమయమున అత్రి మునీంద్రుడు ఆశ్రమమును చేరిరి. ఆ సమయమున అత్రి మునీంద్రుడు ఇంటిలో లేడు. దానితో భిక్షువులు ముగ్గురూ, అమ్మా... మాకు ఆకలి మిక్కుటముగానున్నది. అత్రి మహర్షి వచ్చేవరకూ మేము ఆగలేము. వేవేగ పట్టెడన్నమును మాకు పెట్టమని కోరారు.
 
అనసూయ దేవి భిక్షువులకు ఆతిథ్యము ఇస్తుండగా ముగ్గురొకే మాటగా... ఓ మానవతీ, శిరోమణీ, నీవు దిసమొలతో వడ్డించినచో మేము భుజించాలనుకుంటున్నాము. లేదంటే ఇంకొక చోటును చూసుకుంటామన్నారు. అనసూయ దేవి వారి మాటలు విని... మహాత్ములారా మీ ఇష్టమెట్లాగో అలాగే అవుతుంది అని యింటిలోకి వెళ్లి భర్త పాదారవిందములను మనస్సులో నిలిపి-ధ్యానము చేసి.... నేను పతివ్రతనైతే నేనీ మువ్వురతిథులకు నాపై మాతృభావము వారిపై నాకు పుత్రవాత్సల్యము ఏర్పడును గాక అని వివస్త్రయై వడ్డన చేసేందుకు అక్కడికి చేరుకుంది. 
 
ఆశ్చర్యము... అతిథులు లేరు, వారి మారు వేషములు మాయమైనవి. వారి స్థానమున పాలబుగ్గలతో మిసమిసలాడే పసిపాపలు బోసినవ్వులతో చనుబాలకోసమై కెవ్వుకెవ్వుమంటూ ఆ మహాసాధ్వి వంక చూచిరి. అనసూయదేవి బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు స్తన్యమొసగి సముదాయించి ఉయ్యాలలో పరుండజేసే జోలపాట పాడుచుండ అత్రిమునీంద్రుడు ఆశ్రమంలోకి వచ్చి చూసి ఆశ్చర్యంనొందాడు.
 
అత్రి మునీంద్రుడు త్రిమూర్తులకు నమస్కరించగా.. మేము మీకు పుత్రులమై వెలయుదమని చెప్పెను. శివుడు అంశచే దుర్వాసుడు, బ్రహ్మ అంశచే చంద్రుడు, విష్ణ్వంశచే దత్తాత్రేయుడు అత్రి అనసూయలకు పుత్రులై వెలసిరి.