తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో సోమవారం రాత్రి 7.00 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ మలయప్ప స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణ కాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగు మాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ కటాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.