శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (20:58 IST)

రాఘవేంద్ర స్వామి ఇచ్చిన మట్టి మహిమ... అతడికి పెళ్లయిపోయింది...

మహాత్ములు స్పర్శ తగిలిన ప్రతి వస్తువు గొప్ప మహత్మ్యం కలిగి ఉంటుంది. వారి చేతితో మృత్తికా(మట్టి) ఇచ్చినా అదెంతో విలివ కలిగి ఉంటుంది. రాఘవేంద్ర స్వామి తన భక్తునికి మృత్తిక ఇచ్చి అతని కోరిక ఎలా నెరవేర్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
 
రాఘవేంద్ర స్వామి వారిని రామచంద్రుడనే అందమైన యువకుడు భక్తితో అనన్య రీతిలో సేవ చేస్తున్నాడు. అతనికి పెళ్ళి చేసుకోవాలనే కోరిక కలిగింది. పూజ్య గురువు గారిచే ఆశీర్వాదం పొందడానికి వెళ్లాడు. అప్పుడు రాఘవేంద్రలవారు మృత్తికా శౌచం చేసుకుంటున్నారు. ఆ మృత్తికనే ఒక పిడికెడు ఇచ్చి... నీకు మంచి జరుగుతుంది, పో... అని దీవించి పంపారు. స్వామి మహత్మ్యం తెలిసిన అతను, వారు ఇచ్చిన మట్టే పరమ భాగ్యం అనుకున్నాడు. 
 
ఒకనాడు అతను ఒక ఊరు కులకరణం ఇంటి అరుగుపై పడుకున్నాడు. అర్దరాత్రి బ్రహ్మరాక్షసి అతనిని లేపి భయపెడుతూ దారి వదలమని తొందరపెట్టింది. అతనికి నిద్రమత్తులో ఏమీ అర్దం కాలేదు. నాకు దారి వదులు, నీ తల కింద అగ్గి ఉంది. అది నేను లోపలికి పోవడానికి అడ్డుగా ఉంది అని మళ్ళీ అరిచింది. అప్పుడు స్వామి వారు ఇచ్చిన మట్టిని తలుచుకున్నాడు. అతనికి దాని మహిమ ఇప్పుడు బాగా అర్దమైంది. అప్పుడు అతను ధైర్యం తెచ్చుకుని..... నీకు దారి వదిలితే నాకు ఏం ప్రయోజనం అని అడిగాడు. 
 
అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ఓ బంగారపు పళ్ళెం తీసుకోమని ఇచ్చింది. అప్పుడు తన తల కింద పెట్టుకున్న వ్వామివారు ఇచ్చినా కొంచెం మట్టిని తీసి ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః.... అని గట్టిగా పఠించి రాక్షసిపై రామచంద్రుడు విసిరాడు. అప్పుడు ఆ రాక్షసి అయ్యో నా పని అయిపోయింది అంటూ భగ్గుమని కాలి బూడిదైపోయింది. అదే సమయంలో యజమాని కిటికీ నుండి తొంగి చూశాడు. తనకు పుట్టిన సంతానాన్ని కబళిస్తున్న ఆ బ్రహ్మరాక్షసి పీడా విరగడ కావడం కళ్ళారా చూసి అమితానందం పొందాడు. ఆ ఇంటి యజమాని రామచంద్రునికి నమస్కరించాడు. 
 
అప్పుడు రామచంద్రుడు నాకెందుకు నమస్కారం చేస్తున్నారు..... ఇదంతా రాఘవేంద్ర స్వామి వారు ఇచ్చిని మృత్తిక మహిమ అన్నారు. తాను పెళ్ళి గురించి స్వామి వారిని అడగడం, వారు మృత్తిక ఇచ్చి ఆశీర్వదించడం, అతను ఇక్కడకు వచ్చి పడుకోవడం మొదలైన అన్ని విషయాలను పూస గుచ్చినట్లు వివరించాడు. అతని మాటలు విని యజమాని స్వామి వారి కృపాపాత్రుడైన నీకంటే ఉత్తమ వరుడు ఎవరు ఉన్నారు. నీకు నా చెల్లాయిని ఇచ్చి పెళ్ళి చేస్తానని యజమాని అన్నాడు. అలాగే రామచంద్రునితో పెళ్ళి చేశాడు. ఇది కదా కరుణామయులైన గురుదేవుల మృత్తికా మహిమ.