ఆ విషయం కనిపెట్టినవాడు ధన్యుడు...

సిహెచ్| Last Modified శనివారం, 23 నవంబరు 2019 (21:44 IST)
ధనమేరా అన్నిటికీ మూలం... ఆ ధనం వున్నవాడికే అన్నింటా గుర్తింపు. ఇలాంటివారినే అబ్బో ఏం భోగం అనుభవిస్తున్నారండీ అంటుంటారు. భోగాలు అనుభవించామని చాలా మంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కాని వాస్తవంగా భోగాల కంటే ఎక్కువుగా మనిషే వాటి చేత అనుభవింపబడ్డాడు. ఆ భోగాలే మనిషిని తినేసాయి, క్రుంగదీసాయి, శల్యప్రాయునిగా చేసాయి. ఇదీ అసలు రహస్యం. కనుకనే భోగాలను అనుభవించిన వాళ్ళు చాలామంది రోగాలకు గురవుతున్నారు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు.

అదేవిధముగా కాలం గడిచిపోయిందని జనులు అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా గడిచిపోయింది కాలము కాదు మానవుడి ఆయుష్షు. చిల్లికుండలో పోసిన నీరువలె ఆ ఆయుష్షు దినదినం తగ్గిపోతుంది. ఆ విషయం కనిపెట్టినవాడు ధన్యుడు. వాడు జీవితాన్ని సద్వినియోగపరచుకుంటాడు. దైవ చింతనలో, దైవ ధ్యానంలో కాలం గడుపుతుంటాడు. లేనిచో వృథాగా జీవితం గడిపినట్లు అవుతుంది.

పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు, పుడుతున్నాయి, చస్తున్నాయి. మానవుడి యోక్క జీవితం ఆ విధంగా ఉండకూడదు. ఆయుస్సు దినదినం తగ్గిపోతున్నదని తెల్సుకొని ఆత్మసాక్షాత్కారమనే లక్ష్యం కోసం దాన్ని ఉపయోగించాలి. అజ్ఞాని ఆ విధంగా చేయడంలేదు. దినదినం కోరికలు పెంచుకుంటున్నాడు. భోగాలు అనుభవిస్తూ పోతున్నాడు. వార్ధక్యంలో ఇంద్రియాలు శైథిల్యం పొందినా, భోగాలను గురించిన ఆశమాత్రం తగ్గడం లేదు. అది దినదినం ప్రవర్ధమానమవుతూనే యుంటున్నది.

విజ్ఞుడైనవాడు ఆ ప్రకారం చేయకుండా భక్తి, జ్ఞాన వైరాగ్యాలను చక్కగా అభ్యసించి, ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకుని తృష్టను పారద్రోలాలి. వయస్సు పెరిగినకొలదీ దేవుణ్ణి సమీపించడం నేర్చుకుంటూ ఆఖరికి బ్రహ్మైక్యమును బడసి కృతకృత్యుడు కావాలి.దీనిపై మరింత చదవండి :