సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 17 అక్టోబరు 2019 (22:53 IST)

తేనె ధారలాంటి కామరసాలు అనుభవిస్తూ ఎన్నాళ్లకూ తృప్తి చెందనివాడు ఇలా...

అదొక అరణ్యం. అందులో అతి భయంకరమైనది. పాపం, ఓ బాటసారి దారి తప్పి ఆ అడవిలో చిక్కుకున్నాడు. ఎటు చూసినా క్రూర మృగాలు.  గుండెలవిసిపోయేట్లు అరుస్తున్నాయి. అడుగడుగునా అవి అడ్డం వస్తుండేసరికి భయపడి పరుగుపెట్టాడు.

అవీ వెంటబడ్డాయి. వాటికి తోడు దొంగల గుంపు ఒకటి ఎదురుపడింది. గజగజ వణికిపోయాడు. పాదాలు తొట్రు పడ్డాయి. ఎటు పోవడానికి దారి లేదు. నా అనే వాళ్లెవరూ లేరు. ఎంత పరుగెత్తినా ఆ అడవికి అంతే లేదు. మృగాలు, దొంగలు మీద మీదకు వస్తున్నాయి. ఏం చెయ్యడానికి దిక్కుతోచలేదు. హాహాకారాలు చేస్తూ దిక్కులు చూశాడతడు.
 
ఇంతలో భయంకరమైన ఆకారం గల ఓ స్త్రీ వచ్చి అతడిని గట్టిగా కౌగలించుకుంది. అయిదేసి తలలు గల ఏనుగులు అరణ్యంలో ఎక్కడ చూసినా తిరగడం ప్రారంభించాయి.
 
అక్కడ తీగలు, గడ్డితో మరుగుపడిన నుయ్యి ఒకటి వుంది. గభాలున వచ్చి ఆ పిచ్చి బాటసారి ఆ నూతిలో పడిపోయాడు. ఓ చెట్టు తీగను ఆధారం చేసుకుని, కొమ్మనున్న పనసపండులా తలక్రిందులుగా వేళాడుతున్నాడు. అదే నూతిలో నాలుకలు చాచుతూ భయంకరమైన విష సర్పం బుసలు కొడుతోంది. ఆరు తలలూ, పన్నెండు కాళ్లు గల ఓ పెద్ద ఏనుగు ఆ నూతి దగ్గరున్న చెట్టు దగ్గరకు వచ్చేస్తోంది. 
 
ఆ చెట్టు కొమ్మల్లో తేనెటీగలు తేనెపట్లు పెట్టాయి. తెల్లటి, నల్లటి ఎలుకలు ఆ చెట్టు వేళ్లని కొరుకుతున్నాయి. కొమ్మల మీద నుంచి తేనెపట్టుల నుంచి తేనె ధారలు నూతిలో వేలాడుతున్న బాటసారి నోట్లో పడుతున్నాయి. ఆ భయంకర పరిస్థితుల్లో, ఆ విషాద సమయంలో, అన్ని అడవి మృగాల మధ్యలో వుండి కూడా అతడు ఆ తేనె ధారలు చప్పరిస్తూ ఎంత తాగినా తృప్తి లేకుండా అలాగే తలక్రిందులుగా వేళాడుతున్నాడు.
 
ఎలుకల వల్ల, ఏనుగుల వల్ల ఏ క్షణమైనా ఆ చెట్టు పడిపోవచ్చు. తీగ తెగిపోవచ్చు. తేనెటీగలు ఒళ్లంతా కుట్టువచ్చు. ఇవన్నీ ఊహించుకుని బాధపడుతూ కూడా ఆ మూర్ఖుడు జీవితాశ విడిచి పెట్టలేదు. అదీ చిత్రం" అన్నాడు విదురుడు ధృతరాష్ట్రుడితో.
 
 
విదురా... వింటుంటేనే జాలి కలుగుతోంది. ఆ దారుణ పరిసరాల్లోంచి పాపం చివరికి అతడు ఎలా బయటపడ్డాడు అని అడిగాడు ధృతరాష్ట్రుడు.
 
మహారాజా, సంసారం అరణ్యమని చెప్పడానికి పెద్దలు ఈ ఇతిహాసం చెప్పారు. దీనర్థం చెబుతాను విను. ఆ అరణ్యమే సంసారం. మృగాలు, దొంగలూ రోగాలు. అతడిని కౌగలించుకున్న స్త్రీ ముసలితనం. అయిదు తలల ఏనుగులు పంచేంద్రియాలు. ఆ నూతిలో వున్న సర్పం యముడు. బాటసారి పట్టుకు వేళాడుతున్న తీగ జీవితాశ. నూతి దగ్గరున్న చెట్టు ఆయువు. చెట్టు వేళ్లు కొరికే తెల్లటి, నల్లటి ఎలుకలు పగలూరాత్రులు. అంటే పగలూ, రాత్రులు ఆయువును తినేస్తుంటాయన్నమాట.
 
తేనెటీగలు కోరికలు. తేనె ధారలు కామరసాలు. ఆ కామరసాలు అనుభవిస్తూ ఎన్నాళ్లకూ తృప్తి చెందక ఆయువు నశిస్తున్న సంగతి కూడా గమనించరు ఈ అమాయక ప్రజలు. ఇదీ సంసారమనే అరణ్యం సంగతి. విజ్ఞానవంతులు ఈ పాశాలన్నీ తెంచుకుని బయటపడతారు. శరీరం రథం లాంటిది. మనోబలమే దానికి సారథి. ఇంద్రియాలు గుర్రాలు. ఆ గుర్రాలను పట్టి సరైన మార్గంలో నడిపించగలిగినవాడు సంసార దుఃఖాలను పొందడు అని ధృతరాష్ట్రునికి విదురుడు హితవచనం చెప్పాడు.