శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 30 సెప్టెంబరు 2019 (21:56 IST)

ఏంటో ఈ జీవితం అంటుంటారు... ఎందుకిలా?

విసుగు పుడుతోందనీ, ఏంటో ఈ జీవితం అంటుంటారు చాలామంది. ఇది మీ మనసుకు సంబంధించినది, ఎందుకంటే నిన్నా, మొన్నా జరిగిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు మీ మనులోనే ఉండిపోతాయి. ఈ సృష్టిలో మునుపు జరిగిన సంఘటనల జ్ఞాపకాలు ఇలా ఎక్కడా వ్రాసి ఉండవు. జ్ఞాపకాలు కేవలం మీ జ్ఞాపకశక్తికి, మనసుకి సంబంధించినవి. అలాంటపుడు మీకు కావలిసిందే సృష్టించుకోవచ్చు కదా? ఎలాగు బాహ్య ప్రపంచాన్ని మీ ఇష్ట ప్రకారం మార్చలేరు, సరిదిద్దలేరు. 
 
ఉదాహరణకి మీకు మీ ఆఫీసు నచ్చలేదు, సరే ఇంకో ఆఫీసు వెతుక్కుని మారుతారు. అలాగని మీ కుటుంబం మీకు కావలసినట్లు లేకపోతే కుటుంబాన్ని మార్చలేరు కదా? ఇదొక అంతులేని సమస్యగా మిగిలిపోతుంది. మార్పు అనేది మీలోనే రావాలి. మీలో పరివర్తన వస్తేనే మీ చుట్టూ ఉన్నవన్నీ మారే అవకాశముంది.
 
అందుకే మీ మనసుని ఏదోవిధంగా ధ్యానంపై లగ్నం చేస్తే ఈ విసుగనేది ఉండదు. మనసు పూర్వపు జ్ఞాపకాలపై ఆధారపడి పనిచేస్తోంది కాబట్టే ఈ తిప్పలు. మీ మనసులో నుంచి పుట్టే ఊహలూ, నిన్న మొన్నటి జ్ఞాపకాలూ, వీటి వలనే నడుస్తుంది. నిన్న జరిగిన జ్ఞాపకాలకు పునర్జీవనమిస్తుంది మనసు. 
 
నిన్న జరిగిన సంఘటనను గుర్తుతెచ్చుకోవడం మళ్ళీ ఆ సంఘటనను జీవించినట్లే కదా? అలా చేసిన పనినే గుర్తుతెచ్చుకోవడంతొ విసుగు మొదలౌతుంది. సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, మనకిదేమి విసుగ్గా అనిపించదే? విసుగు అనిపిస్తోందంటే మీ మనసుకి మీరు పూర్తిగా బానిస అయిపోయారు అని. మీ మనసు మిమ్మల్ని పూర్తిగా కబళించి వేస్తోంది. ఇలాగే కొనసాగితే మీ మనసు మిమ్మల్ని పతనం చేస్తుంది.
 
ఇప్పుడు తెలిసిందా? విసుగొస్తోంది అంటే, మీరు జీవితాన్ని పూర్తిగా వృధా చేసేసారు అని అర్థం. మీ ఆలోచనలతో మీకు విసుగు చెందవచ్చేమో కానీ మీచుట్టూ జరుగుతున్న జీవన ప్రక్రియల వల్లనైతే కాదు. ఎందుకంటే జీవితం ఎంతో ఉల్లాసభారితమైనది. ఎన్నో పోగులతో నేసిన వస్త్రంలాంటిది. బహుళ కోణాలలో ఉండే ఈ జీవితంలో విసుగు అనేది రావడానికి ఆస్కారమే లేదు. జీవితం ఎంత  బ్రహ్మాండమైనదంటే ఇది మీ తర్కానికి అందనిది, మీ మనసులో ఇమడలేనిది. 
 
మీ శక్తిసామర్ధ్యాలన్నీ ఉపయోగించినా, శాయశక్తుల ప్రయత్నించినా, ఎన్ని తంటాలు పడినా మీరు జీవిత ప్రక్రియలను గ్రహించలేరు. మీరు వేయి సంవత్సరాలు జీవించినా కూడా వాటిని గ్రహించలేరు. ఎంతకాలం గడిచినా మీరింకా సంభ్రమాశ్చర్యాలలోనే ఉంటారు. ఇంకా జీవితం మొట్టమొదటి పేజీలోనే ఉంటారు, జీవితం మూల సిద్ధాంతాలను గురించే  ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగంటే ఉల్లిపొరలెన్ని వొలచినా, పొరలే వస్తాయి. అదొక అంతులేని ప్రక్రియ 
 
అందుకే ఈసారి మీకు విసుగనిపించినప్పుడు హాయిగా ధ్యానం చేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారంటే దాని అర్థం, మనసు, శరీరంలోనే ఈ రెంటి వలయంలోనే మీ జీవితం గడిపేయడం కాదు. మీ మనసుని , శరీరాన్నీ మీకు కావలసిన చోటికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగించగలగాలి.