సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 23 సెప్టెంబరు 2019 (19:29 IST)

పగటిపూట స్త్రీ సుఖాలు అనుభవిస్తే ఏ పాపం కలుగుతుందో...

ఒకసారి తీవ్ర అనావృష్టి వల్ల భయంకరమైన కరవు ఏర్పడింది. సప్త మహర్షులు కూడా ఆ బాధకు గురికావాల్సి వచ్చింది. వాళ్లందరూ విపరీతమైన ఆకలితో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇంతలో వారికి ఎదురుగా ఓ శవం కనిపించింది. ఆ శవం శిబిచక్రవర్తి కొడుకు ఆజ్యుడనేవాడు తన కొడుకు నీలుణ్ణి యజ్ఞ దక్షిణగా ఇచ్చాడు. అప్పుడా నీలుడు కాలం తీరి చనిపోయాడు. ఆ శవం అతడిదే. ఈ శవాన్ని తిని ఆకలి తీర్చుకుందామన్నారు సప్తర్షులు.
 
అందరూ ఆ శవం వైపు బయలుదేరారు. అరుంధతీ దేవి, గండ అనే పరిచారక, పశుసఖుడనే సేవకుడు కూడా వాళ్ల వెంట వున్నారు. పశుసంఖుడు గండకు భర్త. వృషాదర్భి అనే రాజు వేటకు వెళ్లి, ఆ శ్మశానం పక్కగా తిరిగిపోతూ వాళ్లను చూశాడు. అయ్యా.. ఇదేం ఖర్మ. మీకు కావలసిన ఆహారం, ధాన్యాలు, గోవులు అన్నీ ఇస్తాను నేను. రండి అన్నాడు వాళ్లను సమీపించి. 
 
నువ్వు మహారాజువి, నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు. మాకు అవేమీ అక్కర్లేదు అని సప్తర్షులు వెళ్లిపోయారు. మహారాజు విచారపడ్డాడు. కృత్రిమ ఫలాలు కొన్ని తయారుచేయించి మంత్రుల చేత వాళ్ల దగ్గరకు పంపాడు. వాటిని పట్టి చూసి, వాటి నిండా బంగారం వుందని తెలుసుకుని తిరస్కరించారు మహర్షులు. ఈసారి మహారాజుకి కోపం వచ్చింది. హోమం చేసి కృత్తి అనే ఓ రాక్షసిని సృష్టించి సప్తర్షులను చంపాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అది బయలుదేరింది. ఆ మహర్షులు అప్పుడు కందమూల ఫలాల కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నారు. 
 
ఇంతలో శునస్సఖుడనే ఒక పరివ్రాజకుడు వచ్చి వాళ్లతో స్నేహం చేశాడు. వాళ్లు పదకొండుగురూ ఎక్కడ ఏ ఆహారం దొరక్క, ఆ ప్రక్కనే కొలనులో వున్న తామర తూళ్లను తిందామని అనుకున్నారు. కొలను దగ్గరికెళ్లేసరికి కృత్తి వారికి అడ్డంగా నిలబడింది. శునస్సఖుడు దాని నెత్తిమీద చేతితో కొడుతూ... పాపాత్మురాలా, నీవు భస్మమైపో అని అన్నాడు. అది కాస్తా కాలి బూడిదయిపోయింది. అప్పుడు వాళ్లంతా కొలనులో దిగి తామరతూళ్లు కడిగి తెచ్చుకుని కట్టగా కట్టి పక్కనే వున్న గట్టుమీద పెట్టి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి గట్టు మీద పెట్టిన తామరతూళ్లు కనిపించలేదు. ఒకరి మీద ఒకరు అనుమానపడ్డారు. చివరికి వాళ్లలో వాళ్లే ఒట్లు వేద్దామని నిర్ణయించుకుని శసస్సంఖుడ్ని శపథాలన్నీ వినమని చెప్పారు. 
 
" ఆవును తన్నినవాడూ, సూర్యుడికి ఎదురుగా మలమూత్రాలు విడిచినవాడూ ఏ గతికి పోతారో ఈ తామరతూళ్లు దొంగిలించిన వుంటే నేను కూడా అదే గతికి పోతాను" అన్నాడు అత్రి మహర్షి.
 
నేను కనుక దొంగను అయితే... వేదాలు చదవని వాడూ, సన్యాసం పుచ్చుకుని కామంలో పడ్డవాడూ, కుక్కను ఎత్తుకుని రోత లేకుండా తిరిగేవాడూ ఏ గతికి పోతాడో నేనూ అదే గతి చెందుతాను అన్నాడు వశిష్ఠుడు.
 
సభలో పక్షపాతంగా మాట్లాడితే, దుష్టదానం చేస్తే, పగటిపూట స్త్రీ సుఖాలు అనుభవిస్తే, ఏ పాపం కలుగుతుందో ఈ తామరతూళ్లు దొంగిలించిన పక్షంలో నాకూ అదే కలుగుతుంది అన్నాడు కశ్యపుడు. 
 
జ్ఞాతుల పట్ల, గోవుల పట్లా, కోతుల పట్లా నిర్దయగా ప్రవర్తించినవాడూ, గురువును తిరస్కరించి చదివినవాడూ ఏ గతి పొందుతారో నేనూ అలాంటిదే పొందుతాను అన్నాడు భరద్వాజుడు. 
 
పాడి ఆవును కొట్టినా, నీటిలో మలమూత్రాలు విడిచినా ఎలాంటి పాపం కలుగుతుందో నేను కాజేస్తే అలాంటిదే కలుగుతుందని అన్నాడు జమదగ్ని. 
 
వేదాలను విడిచినవాడూ, పతితల వల్ల ఛండాల స్త్రీల వల్ల జీవించేవాళ్లూ ఎటువంటి నరకం పొందుతారో నాకూ అలాంటిదే కలుగుతుంది అని అన్నాడు గౌతముడు. 
 
తగిన భృత్యుల్ని ఉపేక్షించడం, తగనివాళ్లను దగ్గరకు తీయడం ఎంత పాపమో ఈ తామరతూళ్లు దొంగిలించి వుంటే నాకూ అదే పాపం కలుగుతుంది అన్నాడు విశ్వామిత్రుడు. 
 
అస్తమానం అత్తను దూషించేదీ, భర్త పట్ల ప్రేమ లేనిదీ, పరమాన్నం వండుకుని ఒక్కర్తే తినేదీ అయిన స్త్రీకి ఎటువంటి పాపం కలుగుతుందో నాకూ అంతే అంది అరుంధతి. 
 
వంట చేసి ముందుగా తాను తినేది, పనిదొంగ అయిన స్త్రీ ఎలాంటి దుర్గతి పొందుతుందో అదే గతి నాకూ పడుతుంది అని గండ శపథం చేసింది.
 
ఈ తామర తూళ్లు దాచుకున్నవాడు సంతానహీనుడవుతాడు. గర్భదాసుడవుతాడు అని పశుసఖుడు అన్నాడు. 
 
ఛందస్సు తెలిసినవాడికి గానీ, సోమయాజికి కానీ కూతుర్నిచ్చి ఆనందంగా పెళ్లి చేసినవాడు ఎలాంటివాడో ఈ తామరతూళ్లు కట్టిను దాచినవాడు కూడా అలాంటివాడే అన్నాడు శనస్సఖుడు నవ్వుతూ. అందరికీ అర్థమైపోయింది. 
 
ఆ తామరతూళ్లు నువ్వే తీశావు... మమ్మల్ని బాధ పెట్టక ఇచ్చెయ్ అన్నారు సప్తర్షులు. 
 
నిజమే, నేనే తీశాను. మిమ్మల్ని చంపడానికి వృషాదర్భి కృత్తిని సృష్టించాడు. ఈ సంగతి తెలుసుకుని, దాన్ని చంపి, మిమ్మల్ని రక్షించడానికి ఈ వేషంలో నేను వచ్చాను అన్నాడు ఇంద్రుడు. అవిగో తామరతూళ్లు. తీసుకోండి. మీరు లోభాన్ని విడిచిపెట్టారు కనుక మీకు శాశ్వత పుణ్యస్థానం లభించింది. రండి అని సగౌరవంగా ఆహ్వానించాడు ఇంద్రుడు. ఆ మహర్షులు ప్రీతి పొంది ఆయనతో వెళ్లి ఇంద్రసభలో అందరి మర్యాదలు అందుకున్నారు.