కోట్ల డబ్బు కానుక వేస్తే దేవుడు ఎక్కువగా కరుణిస్తాడా?

Lord Vishnu
సిహెచ్| Last Modified మంగళవారం, 6 ఆగస్టు 2019 (21:24 IST)
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః - అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.

ఎవరు నాకు భక్తితో ఆకును గానీ, పువ్వును గానీ, పండుని గానీ, జలమును గానీ భక్తి పూర్వకంగా సమర్పిస్తారో వాటినే నేను స్వీకరిస్తాను అని అర్థం. పైన తెలిపిన పత్ర పుష్పాదులు పేదలకు, ధనవంతులకు, పండితులకు, పామరులకు అందరికి అందుబాటులో ఉన్న వస్తువులే... శక్తి లేనివారు మేము పెద్దపెద్ద నైవేద్యాలను దేవునికి సమర్పించలేకపోయామే అని దిగులు పడనక్కర్లేదు.

ఎందుకంటే భగవంతుడు భక్తిని, హృదయ శుద్దిని మాత్రమే ప్రధానంగా ఎంచుతాడు. కానీ వస్తువుని కాదు. బ్రహ్మాండాలన్నీ ఆయన పొట్టలోనే కదా ఉన్నాయి. ఆయనకు ఏమి కొరత... ఎంతో భక్తిశ్రద్దలతో శబరి ఎంగిలి చేసిన పండ్లను శ్రీరామునికి నోటికి అందిస్తే ఆ పరందాముడు ఎంతో ప్రేమగా స్వీకరించాడు. అలాగే శ్రీకృష్ణుడు అడిగి మరీ కుచేలుని వద్ద అటుకులు పెట్టించుకుని మరీ ఆరగించాడు.

అదేవిదంగా సాయినాధుడు వద్దకు ఎందరో ధనవంతులు ఖరీదైన పిండివంటలు తెచ్చి పెట్టినా కడు బీదరాలు తెచ్చిన జొన్నరొట్టెను తిన్నారు. ఎవరైనా సరే భక్తితో కూడి నిర్మలచిత్తుడై ఉన్నట్లయితే అతడు సమర్పించిన దానినే సర్వేశ్వరుడు స్వీకరిస్తాడు. ముక్తికి అర్హత, యోగ్యత ప్రధానం కానీ తక్కిన విషయాలు కావు అని భగవంతుడు ఉద్బోధిస్తున్నాడు.దీనిపై మరింత చదవండి :