బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2016 (12:10 IST)

తిరుమలలో కొండలా పేరుకుపోయిన విదేశీ నాణేలు.. గోనె సంచుల్లో మగ్గుతున్న చిల్లర

తిరుమల తిరుపతి దేవస్థానంలో విదేశీ చిల్లర నాణేలు కొండలా పేరుకుపోయి ఉన్నాయి. ఈ చిల్లరను గత కొన్నేళ్ళుగా మార్పిడి చేయకపోవడంతో 50 టన్నులకుపైగా గోనె సంచుల్లో మగ్గుతున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానంలో విదేశీ చిల్లర నాణేలు కొండలా పేరుకుపోయి ఉన్నాయి. ఈ చిల్లరను గత కొన్నేళ్ళుగా మార్పిడి చేయకపోవడంతో 50 టన్నులకుపైగా గోనె సంచుల్లో మగ్గుతున్నాయి. 2009 నుంచి విదేశీ నాణేల మార్పిడి జరగలేదు. ఇవి తితిదేకి భారంగా మారుతున్నాయి. అందుకే విదేశీ నాణేలను మన నగదులోకి మార్చుకోవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
 
శ్రీవారికి వెండి, బంగారు ఇతర విలువైన లోహాలతో తయారైన ఆభరణాలు, దేశీయ నగదుతో పాటు విదేశీ కరెన్సీ రూపంలోను కానుకలు వస్తున్నాయి. నోట్ల రూపంలో వస్తున్న విదేశీ కరెన్సీని ఎప్పటికప్పుడు బ్యాంకులో జమచేసి మన నగదులోకి మార్చుకుంటున్న తితిదే విదేశీ చిల్లరా నాణేలను అలాగే పోగేస్తూ వస్తోంది. 
 
తిరుమల శ్రీవారి హుండీతో పాటు తితిదేకి చెందిన వివిధ ఆలయాల్లోని హుండీల ద్వారా లభించే నాణేలను తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఉన్న చిల్లర పరకామణికి చేర్చుతారు. ఇక్కడ స్వదేశీ, విదేశీ నాణేలను చేరవేస్తారు. విదేశీ నాణేలను 2003 దాకా తూకం వేసి విక్రయించేవారు. ఆ తర్వాత దేశాల వారీగా నాణేలను విభజించి ఆనాటికి వాటి విలువను బట్టి విక్రయించారు. ఈ పద్థతిలో 2009లో చివరిసారిగా నాణేల విక్రయం జరిగింది. 
 
తితిదే వద్ద అనేక పురాతన నాణేలు కూడా పోగయ్యాయి. ఈ క్రమంలోనే తితిదే చెన్నైలోని ముద్రాశాస్త్రం, మ్యూజియం విభాగాల అధికారులను సంప్రదించారు. తన వద్ద పురాతన నాణేలను గుర్తించడానికి ఈ ప్రయత్నం చేశారు. అలాగే హైదరాబాద్‌లోని పురావస్తు శాఖ అధికారులనూ సంప్రదించారు. అక్కడి నుంచి వచ్చిన అధికారుల బృందం తితిదేలోని విదేశీ నాణేలను, పురాతన నాణేలను 2011 జనవరిలో మూడు రోజుల పాటు పరిశీలించింది.
 
పురాతన నాణేలను వేరు చేసిన తర్వాత విదేశీ నాణేలను దేశాల వారీగా విలువ వారీగా విభజించ విశాఖపట్నంలోని ఎంఎస్‌టిఎస్‌ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఈ-వేలంలో విక్రయించాలని నిర్ణయించారు. రిజర్వుబ్యాంకు సలహాలను కూడా అధికారులు తీసుకున్నారు. అప్పటికే శ్రీవారి తలనీలాలను ఎంఎస్‌టిఎస్‌ ద్వారానే విక్రయిస్తున్న నేపథ్యంలో విదేశీ నాణేలనూ అదే సంస్థ ఆధ్వర్యంలో వేలం వేయాలని భావించారు. ఈ మేరకు 2012జూన్‌లో తితిదే పాలకమండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయినా వివిధ కారణాల వల్ల అదది వాయిదా పడుతూ వచ్చింది. తితిదే తీర్మానం చేసిన నాటికే ట్రెజరీలో 26టన్నుల విదేశీ నాణేలు పోగుపడి ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ఇంకెన్ని టన్నులకు చేరుకుని ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. కనీసం 50 టన్నులు ఉండవచ్చని చెబుతున్నారు.
 
పురాతన నాణేలను యేళ్ల తరబడి పక్కనబెడుతూ వచ్చారు. దీని వల్ల భారీగా పోగయ్యాయి. శ్రీకృష్ణ దేవరాయలు సహా ఎందరో రాజులు, రాణులు, ఆయా కాలాల్లోని అధికారులు స్వామివారికి కానుకలు సమర్పించారు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, యాదవ రాజులు, మహ్మదీయులు ఇలా ఎందరో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆయా కాలల్లో చెలామణిలో ఉన్న నాణేలన్నీ పరిశీలిస్తే ఎంతో విలువైన అత్యంత పురాతనమైన నాణేలు లభించే అవకాశాలున్నాయి. వీటిని భద్రపరచాల్సిన అవసరం ఉంది.