తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. 43 రోజుల్లో స్వామి సేవలో 35 లక్షల మంది
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త రికార్డును నమోదు చేసింది. అది కూడా అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించి. గతంలో వేసవి కాలంలో ఎప్పుడూ లేనివిధంగా అనూహ్యంగా వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించింది. మే 1వ తేదీ నుంచి ఆదివారం వరకు 43 రోజుల్లో 35 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సాధారణంగా భక్తుల రద్దీ పెరిగితే ఆందోళనలు, తితిదే ఉన్నతాధికారులపై శాపనార్థాలు ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పెద్దగా ఎక్కడ కూడా ఇలాంటివి కనిపించలేదు. కారణం వచ్చిన భక్తులను కంపార్టుమెంట్ల నుంచి అలాగే క్యూలైన్లలోకి వదలడం. దీని కారణంగా త్వరితగతిన భక్తులు దర్శనం చేసుకోగలిగారు.
తితిదే ఈఓ సాంబశివరావుతో పాటు జెఈఓ శ్రీనివాసరాజుల పర్యవేక్షణే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన సమయంలో వెంటనే వీఐపీ దర్శనాలను రద్దు చేయడమో, తగ్గించడమో చేయడం వల్ల సామాన్యభక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకోగలిగారు.