గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (12:28 IST)

రథ సప్తమి వేడుకలు .. తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల గిరులు భక్తులకో కిటకిటలాడుతున్నాయి. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై  భక్తులకు దర్శనమివ్వనున్నారు. 
 
సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకుని భక్తులకు దర్శనమిచ్చారు. 
 
అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఉదయం 8గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 
 
11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. 
 
ఒకే రోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు భక్త జనసంద్రంగా మారాయి.