భక్తులకు అందుబాటులో పద్మావతి అమ్మవారి వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లను మంగళవారం నుండి టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. భక్తుల కోరిక మేరకు తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఇక్కడ ఆన్‌లైన్ విధానంలో కల్యాణోత్సవం నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఆలయాల్లో ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు కల్యాణోత్సవం టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ ధర రూ.500/-గా నిర్ణయించారు. గృహస్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకుని ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణోత్సవాన్ని వీక్షించవచ్చు.
ఆ తరువాత 90 రోజుల్లోపు గృహస్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పించారు. దర్శనానంతరం ఉత్తరీయం, రవిక, అక్షింతలు ప్రసాదంగా అందిస్తారు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు ఆన్‌లైన్ కల్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.