శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: సోమవారం, 16 మే 2016 (12:30 IST)

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ... చేతులెత్తేసిన తితిదే

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. నాలుగు రోజుల నుంచి తిరుమల గిరులలో రద్దీ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం తర్వాత రద్దీ తగ్గుముఖం పడుతుందని తితిదే భావించింది. అయితే రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. అధికసంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు 32 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. రెండు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లు వెలుపలికి వచ్చేశాయి. క్యూలైన్లలో భక్తులు నరకయాతనను అనుభవిస్తున్నారు. తితిదే సర్వదర్శనం భక్తులకు 10 గంటల్లో దర్శనం పూర్తవుతుందని ప్రకటించగా అది ఏమాత్రం సాధ్యం కావడం లేదు. 
 
కాలినడక భక్తుల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. కాలినడక భక్తుల కంపార్టుమెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. గంటల తరబడి తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వచ్చి తిరిగి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు భక్తులు. తితిదే మాత్రం కాలినడక భక్తులకు 8 గంటల్లో దర్శనం చేయిస్తామని చెబుతున్నా వారు చెప్పిన సమయం కన్నా అధిక సమయం పడుతోంది. గదుల పరిస్థితి అసలు చెప్పనవసరం లేదు. గదులన్నీ ఫుల్‌. ఏ మాత్రం గదులు తిరుమలలో దొరకడం లేదు. తలనీలాలు ఇచ్చే కళ్యాణకట్ట వద్ద కూడా ఇదే పరిస్థితి. నిన్న శ్రీవారిని 89,027మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయ 2 కోట్ల 65లక్షల రూపాయలు లభించింది.