హర్యానా స్టీలర్స్ గెలుపు, 37-25తో జైపూర్ పింక్ పాంథర్స్ చిత్తు
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో హర్యానా స్టీలర్స్ తొలి విజయం నమోదు చేసింది. గత సీజన్ ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్‌కు తొలి మ్యాచ్‌లో చుక్కెదురైనా.. రెండో మ్యాచ్‌లో గొప్పగా పుంజుకుంది. వరుస విజయాల ఊపుమీదున్న జైపూర్ పింక్ పాంథర్స్‌ను 37-25తో చిత్తు చేసి సీజన్లో తొలి విక్టరీ సాధించింది. కూతలో, పట్టులో హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించటంతో పింక్ పాంథర్స్‌పై ఆ జట్టు 12 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెయిడర్లు వినయ్ (10), నవీన్ (6), శివం (4).. డిఫెండర్లు రాహుల్ (3), మహ్మద్‌రెజా (2) సూపర్ షోతో మెరిశారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున రెయిడర్ అభిజిత్ మాలిక్ (6) ఒక్కడే ఆకట్టుకున్నాడు. రెజా (2), అర్జున్ (3), శ్రీకాంత్ (2) నిరాశపరిచారు.
స్టీలర్స్ షో :
తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన గత సీజన్ రన్నరప్ హర్యానా స్టీలర్స్.. రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్‌ను నిలువరించి.. స్టీలర్స్ షో చేసింది. తొలి 20 నిమిషాల ఆటలోనే ఆధిపత్యం చూపించిన హర్యానా స్టీలర్స్ విజయానికి గట్టి పునాది వేసుకుంది. రెయిడింగ్, ట్యాక్లింగ్‌లో దుమ్మురేపిన స్టీలర్స్ ప్రథమార్థంలో 20-11తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెయిడర్ వినయ్ సూపర్ టెన్‌తో చెలరేగగా.. నవీన్ సైతం అదరగొట్టాడు. డిఫెన్స్‌లో రాహుల్, మహ్మద్‌రెజా ఆకట్టుకున్నారు. మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ సమిష్టిగా రాణించటంలో విఫలమైంది. ఇటు కూతలో, అటు పట్టులో తేలిపోయింది. ప్రథమార్థంలో 11 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ద్వితీయార్థంలో ఆ మాత్రం ప్రదర్శన సైతం చేయలేకపోయింది. ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో తొలి విజయం సాధించారు. ఈ సీజన్లో మూడు మ్యాచుల ఆడిన పింక్ పాంథర్స్‌కు ఇది తొలి పరాజయం.