1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (12:33 IST)

కోచింగ్ పేరుతో విద్యార్థికి లైంగిక వేధింపులు.. భారతీయ కోచ్‌కు జైలు

కోచింగ్‌కు వచ్చిన విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఒక భారతీయ ఫుట్‌బాల్ కోచ్‌కు జైలు శిక్ష పడిన సంఘటన దుబాయ్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... దుబాయ్‌లో నివసిస్తున్న ఒక భారతీయ విద్యార్థికి ఫేస్‌బుక్ ద్వారా అక్కడే ఉంటున్న ఓ ఇండియన్ కోచ్ గత ఏడాది పరిచయమయ్యాడు. తనకు ఫుట్‌బాల్ కోచింగ్ ఇవ్వాలని అడిగితే అంగీకరించాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ మైదానంలో ఆ విద్యార్థికి శిక్షణ ఇచ్చేవాడు. 
 
కొన్ని నెలల తర్వాత విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇదిలావుంటే ఒకసారి.. ఆ విద్యార్థి న్యూడ్‌గా ఉన్న సమయంలో ఆ కోచ్ దొంగచాటుగా ఫొటోలు తీశాడు. ఆ తర్వాత నుంచి తనతో సెక్స్‌లో పాల్గొనాలంటూ విద్యార్థిపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీనికి ఆ కుర్రాడు ససేమిరా అంగీకరించకపోవడంతో, తను తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. 
 
ఈ నేపథ్యంలో సదరు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా కోచ్ ప్రవర్తన ఇదే రీతిగా ఉండేదని తనకు ఈ మధ్యే తెలిసిందని అప్పటినుంచి అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించాడు. తాను పిలిచినప్పుడు వచ్చి లైంగిక చర్యలు జరపాలని, లేనిపక్షంలో తాను మొబైల్ ఫోన్లో తీసిన న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పాడు. 
 
దీంతో కోచ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయన సెల్ ఫోన్‌ను పరిశీలించి చూడగా బాలుడి న్యూడ్ ఫొటోలు కనపడ్డాయి. కోచ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశ పెట్టారు. లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ నేరాల కింద భారతీయ కోచ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.