1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2016 (08:55 IST)

భారత స్టార్ బాక్సర్ విజేందర్ సంచలన విజయం... మూడో రౌండ్‌కే ప్రత్యర్థి ఔట్

భారత స్టార్ బాక్సర్ విజేందర్ సంచలన విజయం సాధించారు. ప్రపంచ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ పోరులో శనివారం రాత్రి జరిగిన బౌట్‌లో భారత బాక్సర్ విజేందర్‌ సత్తా చాటి

భారత స్టార్ బాక్సర్ విజేందర్ సంచలన విజయం సాధించారు. ప్రపంచ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ పోరులో శనివారం రాత్రి జరిగిన బౌట్‌లో భారత బాక్సర్ విజేందర్‌ సత్తా చాటి ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రత్యర్థి టాంజానియాకు చెందిన ప్రముఖ బాక్సర్ ఫ్రాన్సిస్ చెకా కేవలం మూడో రౌండ్‌కే చేతులెత్తేయడంతో విజేందర్ ఘన విజయం సాధించాడు. ఈ గెలుపుతో భారత బాక్సింగ్ మరోమైలురాయి దాటింది.
 
ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన అనంతరం పరాజయమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్‌‌కు ఇది అద్భుతమైన విజయం. డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగిన విజేందర్ పది రౌండ్లపాటు జరగాల్సిన ఫైట్‌‌లో మాజీ ప్రపంచ చాంపియన్‌ ఫ్రాన్సిస్‌ చెకా (టాంజానియా)తో మూడో రౌండ్లోనే ప్రత్యర్థి చెకాను నాకౌట్ చేసి టైటిల్ నిలబెట్టుకున్నాడు. రింగ్‌లోకి దిగిన తర్వాత పంచ్ విసరడమే నా పని. బౌట్‌లో అదే చేయబోతున్నానని చెప్పిన విజేందర్ ఢిల్లీలోని త్యాగరాజ్ స్డేడియం రింగ్‌లో తాను చెప్పింది చేసి చూపించాడు.
 
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన విజేందర్ ఇప్పటివరకూ 8 విజయాలు సాధించగా, అందులో ఏడు నాకౌట్ విజయాలు ఉండటం గమనార్హం. విజేందర్ పంచ్‌లను తట్టుకోలేక మూడో రౌండ్లోనే ఓటమిని అంగీకరించాడు. విజేందర్ ప్రత్యర్థి చెకా 43 ఫైట్లలో తలపడగా 32 విజయాలున్నాయి. ఇందులో 17 నాకౌట్స్‌ ఉన్నాయి.