గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (14:37 IST)

ఏపీలో వేలెట్టి రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తాం : కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. చంద్రబాబు అంతు చూస్తానని హెచ్చరించారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం మాదాపూర్‌లో నిర్వహించిన స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఐటీ కంపెనీల సీఈవోలు, బిజినెస్ హెడ్స్, ఐటీ ఉద్యోగులు హాజరయ్యారు. 
 
ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసినికి పార్టీ టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు ఆమెను బలపశువును చేస్తున్నారన్నారు. 
 
అంతేకాకుండా, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటూ పదేపదే చంద్రబాబు చెప్పుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. కేవలం నాలుగు బిల్డింగ్‌లు కట్టిన చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు ఎంతుండాలన్నారు. 
 
అలాగే, చంద్రబాబు తెలంగాణా రాజకీయాల్లో వేలు పెట్టాడని.. దీన్ని తాము సహించబోమన్నారు. అందుకే తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టి చంద్రబాబును రాజకీయంగా అంతు చూస్తామని కేటీఆర్ హెచ్చరించారు. 
 
ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న ఈ తరుణంలో కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇపుడు సంచలనంగా మారింది. ఎన్నికల్లో తెరాస ఓడిపోవడం ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 10 సీట్లను దక్కించుకోవాలన్న పట్టుదలతో తెరాస ఉంది. అందువల్లే కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.