కేటీఆర్ రోడ్ షోలో అలిగి వెళ్లిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి... ఎందుకు?
హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జూబ్లిహిల్స్ నియోజకవర్గం రెహ్మత్ నగర్, యుసుఫ్ గూడ, మోతీనగర్ తదితర ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి గోపినాధ్‌కి స్థానిక టీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒక దశలో సతీష్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయబోయారు. అయితే, అక్కడే ఉన్న మేయర్ బొంతు రామ్మోహన్ కలుగజేసుకుని గొడవ సద్దమణిగేలా చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేతలను సమన్వయం చేసుకుపోవాలంటూ గోపీనాథ్‌ను మందలించారు. నాకు వ్యతిరేకంగా సతీష్ రెడ్డి పనిచేస్తున్నాడని నా దగ్గిర ఆడియో టేపులు ఉన్నాయని చెప్పి మాగంటి గోపీనాథ్ అలిగి రోడ్ షో నుంచి మధ్యలోనే వెళ్లిపోయినట్టు సమాచారం. దీనిపై కేటీఆర్ ఆరా తీసి గోపినాధ్‌కు, సతీష్ రెడ్డికి సయోధ్య కుదర్చమని పార్టీ నేతలకు ఆదేశాలు జారీచేశారు.