తెలంగాణ ఎన్నికల సిత్రం : జీపే - ఫోన్‌పేలలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి పద్ధతులను ఎంచుకుంటున్నారు.
ఆయా నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాతో పాటు వారి మొబైల్ నంబర్లను సేకరించి, వాటికి వివిధ రకాల మొబైల్ యాప్‌ల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ప్రత్యేక సిబ్బందిని సైతం నియమించుకోవడం గమనార్హం.
ఎన్నికల ప్రచారం కోసం తమ వెంట తిరిగే వందలాది మంది నేతలు, కార్యకర్తల్లో సింహ భాగం పెయిడ్ కార్యకర్తలే. విద్యార్థులు, యువత, మహిళా సంఘాల సభ్యులకు డబ్బులిచ్చి వెంట తిప్పించుకుంటున్నారు.
అలాంటి వారికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా అర్థరాత్రి దాటిన తర్వాత పేటీఎం ద్వారా పంపిస్తున్నారు. ఉదయమే వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకొని, వారి పేటీఎం నంబర్ తీసుకొని గుట్టు చప్పుడుకాకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.