గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (11:09 IST)

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కీలక బాధ్యతలు!!

ranganath
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొన్ని కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తుంది. చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేస్తే ఆక్రమణలకు గురికాకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. 
 
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మరో కీలక బాధ్యతను అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
 
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ రంగనాథ్‌ను నియమిస్తారని సమాచారం. కాగా, ఇప్పటివరకు ఈ బాధ్యతలను హెచ్ఎండీఏ కమిషనర్ నిర్వహిస్తున్నారు. హెచ్ఎండీఏలోని ఏడు జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవడం ద్వారా ఆక్రమణలకు గురి కాకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన.
 
ఇందులోభాగంగా హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యతలను కూడా రంగనాథ్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లోని చెరువుల సర్వే, ఎఫ్ఎల్ నిర్ధారణ, నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు.