సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (20:05 IST)

పవన్ కళ్యాణ్ నా దేవుడు.. నా రక్తం కాంగ్రెస్ : బండ్ల గణేష్

bandla ganesh
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ తనకు దేవుడని సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోమారు స్పష్టం చేశారు. అయితే, తన శరీరంలో మాత్రం కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తుందని, అందువల్ల తాను పక్కా కాంగ్రెస్ అభిమానని చెప్పారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ రీరిలీజ్‌ను పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో బండ్ల గణేష్ మాట్లాడుతూ, తాను పక్కా కాంగ్రెస్ వాదినని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తనకు ఎనలేని అభిమానమన్నారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన కోరిక అన్నారు. 
 
అక్రమ నిర్మాణాలపై హైడ్రా చేపట్టిన చర్యలు మంచివేనన్నారు. ఇందులో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారన్నారు. ఇపుడు తన ఇంటికి ఇచ్చినా నోటీసులు తీసుకుంటానని తెలిపారు. బఫర్ జోన్ లేదా ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉంటే కూల్చివేసుకోవచ్చన్నారు. ఇకపోతే, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరబోనని తెలిపారు. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీ అభిమానని చెప్పారు. పవన్ తనకు భగవంతుడితో సమానమన్నారు. "గబ్బర్ సింగ్" సినిమా తర్వాత తన జీవితం దశ దిశ తిరిగిపోయిందన్నారు. ఈ జన్మకు పవన్‌కు వీరభక్తుడినని తెలిపారు. 
 
ఇకపోతే, గతంలో ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు ఏదో మూడ్‌లో ఉండి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నోరు జారానని చెప్పారు. ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత తామిద్దరం కలిసి మాట్లాడుకున్నామని తెలిపారు. ఆయనకు ఇపుడు మీ ద్వారా క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. 'తీన్‌మార్' సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్మానని, కానీ, చిన్నచిన్న సమస్యల వల్ల అది మిస్‌‍ఫైర్ అయిందన్నారు. ఈ చిత్రాన్ని మళ్లీ అద్భుతంగా చేసి రీ రిలీజ్ చేసి హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్నట్టు ఆయన తెలిపారు.