గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (12:22 IST)

ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడిన మాట వాస్తవమే : భట్టి విక్రమార్క

bhatti vikramarka
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కోసం ఆశపడిన మాట వాస్తవమేనని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లను కైవసం చేసుకుని విజయం సాధించి, గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాను కూడా సీఎం రేసులో ఉన్నట్టు పలు సందర్భాల్లో ఆయన మీడియా ముందు వ్యాఖ్యానించారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. దీనిపై భట్టి విక్రమార్క స్పందిస్తూ, ముఖ్యమంత్రి పదవిని ఆశించిన విషయం నిజమేనని చెప్పారు. అయితే, అందరికీ పదవులు దక్కడం అసాధ్యమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును హైకమాండ్ ఎంపిక చేసిందని గుర్తు చేశారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి వుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. 
 
తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. మరో రెండు నెలల్లో పంచాయతీ పండుగ  
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గత నెలలో ఎన్నికలు జరగ్గా.. ఈ నెల మూడో తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. గురువారం ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అయితే, మరో రెండు నెలల్లో ఆ రాష్ట్రంలో మరో ఎన్నికల పండగ జరుగనుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం వచ్చేయేడాది జనవరి 31వ తేదీతో ముగియనుంది. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 
 
ఇందుకు సంబంధించి సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో జిల్లాల వారీగా రిపోర్ట్ సిద్ధం చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ ఈ మేరకు లేఖ పంపించారు. డిసెంబర్ 30లోపు కసరత్తు పూర్తిచేసి వివరాలు అందించాలని కోరారు. ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఎంపిక, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లో వివరాలు నమోదు చేయడం వంటి వాటిపై కలెక్టర్లకు కీలకమైన సూచనలు చేశారు. 
 
సర్పంచ్, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లకు సంబం ధించిన వివరాలను గ్రామ కార్యదర్శులు ఎన్నికల సంఘానికి పంపించారు. కాగా, తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలు, లక్షా 13 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. అయితే ఇవి ముందస్తు ఏర్పాట్లు మాత్రమేనని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనేది కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎందుకంటే వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.