బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జూన్ 2024 (17:00 IST)

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

rajasingh
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఆ రాష్ట్ర పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. మెదక్‌లో జంతు వధకు సంబంధించిన అల్లర్లు జరగడం తెల్సిందే. ఆ సమయంలో అనేక దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురికాగా, నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. 
 
ఈ నేపథ్యంలో మెదక్ వెళ్లేందుకు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. తాను మెదక్ వెళతానని రాజా సింగ్ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమై రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ఆదివారం ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు... ముందుగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అటు మెదక్‌లో బీజేపీ శ్రేణులు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.