గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2024 (19:26 IST)

వరదలతో బాధపడుతున్న ఆంధ్ర ప్రజలను ఆదుకోవాలని మీకు లేదా? ఆంధ్రకు ఆమ్రపాలి?

Amrapali IAS
కర్టెసి-ట్విట్టర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లం మొర్రో అంటున్నారు ఆ ఐఏఎస్ అధికారులు. ఈ నెల 9వ తేదీన కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి తాము తెలంగాణ రాష్ట్రంలోనే వుండేట్లు చూడాలంటూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రోనాల్డ్ రాస్, సృజనలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) ను ఆశ్రయించారు. ఐతే వారి పిటీషన్లు విచారించిన క్యాట్ వారి ముందు ఆలోచింపజేసే వ్యాఖ్యలను చేసింది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వరుస వర్షాలతో వరదలు వచ్చి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి వారికి తగిన సేవ చేయాలని మీకు లేదా అంటూ ప్రశ్నించింది. ఐఏఎస్ ల కేటాయింపులపై డీవోపీటికి పూర్తి అధికారాలు వున్నాయనీ, స్థానికత అనే అంశం వున్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం నిబంధనలలో వున్నాయా అంటూ ప్రశ్నించింది.
 
కేంద్రం ఆదేశించినట్లుగానే జాబితాలో వున్న ఐఏఎస్ అధికారులు అందరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. దీనితో పలువురు అధికారులు ఇప్పటికే ఏపీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలలో సైతం సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఆమె ఏపికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.