బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (12:04 IST)

సీఎం సార్ కొలువు చేపట్టగానే గుర్తు చేశారు.. ఇపుడు మరిచిపోయారు.. మాజీ డీఎస్పీ నళిని

ex dsp nalini
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిపై ఆ రాష్ట్రానికి చెందిన మాజీ డీఎస్పీ నళిని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టినపుడు తనను గుర్తు చేసుకున్నారని, ఇపుడు మరిచిపోయారని, తన ఉద్యోగం విషయంలో తాను ఇచ్చిన విన్నపాలు బుట్టదాఖలైనట్టుగా ఉన్నాయని ఆమె నిర్వేదం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేయడం ద్వారా వార్తల్లోకెక్కిన నళిని... తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని, నళిని కావాలనుకుంటే డీఎస్పీ ఉద్యోగంలో తిరిగి చేరొచ్చని, లేకపోతే ప్రభుత్వంలో మరేదైనా ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో, నళిని పెట్టిన తాజా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది.
 
'సీఎం సార్ కొలువు చేపట్టగానే నన్ను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేమో దాని గురించి ఏమీ మాట్లాడంలేదు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగాయి. కానీ నా ఊసెత్తకపోవడం ఆశ్చర్యం కలిగించింది. నేను ప్రభుత్వానికి చేసుకున్న రెండు దరఖాస్తులు బల్లపై ఉన్నాయో, చెత్తబుట్టలోకి పోయాయో అనే డౌట్ వస్తోంది. ఇప్పుడే చీఫ్ సీఆర్డీఓను, ఓఎన్డీని ఈ విషయమై సంప్రదించాను. ఇదే విషయమై లేఖ కూడా రాశాను.
 
చిన్నప్పుడు అడుక్కునేవాళ్లు ఇంటి ముందుకు వస్తే ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెళ్లవయ్యా అని మెల్లగా చెప్పేవాళ్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నాళ్లు ఎవరినీ కలవలేదు. ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. కేవలం ఒక నెలలోనే నా పిటిషన్‌పై విచారణ చేస్తారనుకున్నాను. కానీ ఏడు నెలలు కావస్తోంది. అందుకే రిమైండర్ లేఖ రాయాల్సి వచ్చింది. ఈ పోస్టు కూడా దాని గురించే. సెక్రటేరియట్ చుట్టూ తిరిగే ఓపిక, సమయం నాకు లేవని ఆ రోజే నేను రేవంతన్నకు చెప్పాను' అంటూ నళిని తన పోస్టులో వివరించారు.