బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (12:44 IST)

బలహీనంగా ఉన్నాడని కొడుకుని ఆస్పత్రిలో చేరిస్తే తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది..

deadbody
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఓ విషాదకర ఘటన జరిగింది. తమ కుమారుడు బలహీనంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కొడుకుని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఉన్నట్టుండి మూర్ఛ రావడంతో ఆ కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ కూకట్ పల్లి సుమిత్రానగర్ ఎల్లంబండ‌కు చెందిన ఇ.రమేష్, మహాలక్ష్మికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొలికాన్పులో కుమార్తె జన్మించింది. ఈ బాలిక కొద్ది రోజులకు అనారోగ్యంతో చనిపోయింది. రెండో సంతానంగా కుమారుడు పుట్టగా, సిద్ధు అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండటంతో తల్లిదండ్రులు అతన్ని నెల రోజుల క్రితం రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన సిద్ధుకు ఒక్కసారిగా మూర్ఛ వచ్చింది. దీంతో ఆ బాలుడిని హుటాహుటిన ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాల్సిందిగా ఆసుపత్రిలోని సిబ్బంది సూచించడంతో తల్లి మహాలక్ష్మి సిద్ధును ఎత్తుకుని పరుగులు తీసింది. ఆమె కాళ్లకు చీర అడ్డుపడి ఆసుపత్రిలోని మెట్ల వద్ద కిందపడిపోయింది. ఒళ్లోనే ఉన్న సిద్ధు కూడా కిందపడటంతో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. దీంతో వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. చిన్నారి సిద్ధు పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. స్ట్రెచర్‌పై తరలించే ఏర్పాట్లు చేసివుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆరోపిస్తున్నారు. అయితే, మందులు కొనేందుకు వెళ్తున్న సందర్భంలో తల్లీకొడుకులిద్దరూ కిందపడ్డారని పోలీసులు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.