KTR: సమంత విడాకులకు కేటీఆర్ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?
ఎమ్మెల్సీ కవిత ఇటీవల అమెరికాకు వెళ్లారు కానీ తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఒక పూల బొకే, లేఖ పంపారు. కవితకు బహిరంగంగా కృతజ్ఞతలు తెలుపుతూ సురేఖ ఎక్స్‌లో దీనిని షేర్ చేశారు. కొండా సురేఖ, కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుకుంటుందనే విధంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కవిత.. సురేఖకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం అవసరమా అంటూ బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
గత అక్టోబర్‌లో, నటి సమంత, నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ చేసిన కామెంట్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని సురేఖ ఆరోపించారు. అలాగే కేటీఆర్ ఈ వ్యాఖ్యలను నిరాధారమైనవని ఖండిస్తూ ఆమెపై క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టారు. రెండు వారాల క్రితం, నాంపల్లి కోర్టు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీవ్రమైన న్యాయ పోరాటం మధ్య, సురేఖ పట్ల కవిత చూపిన స్నేహపూర్వక పోస్టులు.. తోబుట్టువుల మధ్య గ్యాప్‌ను పెంచుతాయనే టాక్ వినిపిస్తోంది.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మద్దతుదారులు కవితను విమర్శించారు. కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే, పార్టీ రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కుటుంబ విభేదాలను రేకెత్తించడానికి మాజీ ముఖ్యమంత్రి ఇష్టపడటం లేదు. కవిత తన తెలంగాణ జాగృతి వేదిక కింద స్వతంత్రంగా కూడా పనిచేస్తున్నారు.