శనివారం, 29 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 మార్చి 2025 (14:45 IST)

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

Apsara murder case
Apsara murder case
2023లో అప్సర హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్సర హత్య కేసులో దోషిగా తేలిన పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌కు చెందిన సాయికృష్ణ సరూర్‌ నగర్‌లో ఓ దేవాలయంలో పూజారి. అతడికి అప్పటికే పెళ్లి అయినప్పటికీ అప్సరతో పరిచయం పెంచుకుని, సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్లుగా వాళ్లు హాయిగా తిరిగారు. 
 
అప్సర గర్భం దాల్చడంతో అసలు సమస్య మొదలైంది. తనను పెళ్లి చేసుకోవాలని పూజారికి అప్సర చెప్పింది. అయితే, దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ తాను ఇటువంటి పనులు చేస్తున్నానని ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని అప్సరను పూజారి చంపాలని ప్రణాళిక వేసుకున్నాడు. 
 
పక్కా సమాచారం ప్రకారం కోయంబత్తూరుకు తీసుకెళ్లి బెల్లం దంచే రాయితో తలపై కొట్టాడు. అప్సర మృతదేహాన్ని డ్రైనేజీలో పూడ్చి, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపి, దానిపై సిమెంట్‌ కూడా వేయించాడు. ఆ తర్వాత అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు జరిపి పూజారే నిందితుడని గుర్తించారు.

ఈ కేసుపై రంగారెడ్డి కోర్టు విచారణ చేసి.. వాదనలను విన్న తర్వాత పూజారికి జీవిత ఖైదు విధించింది. అలాగే సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. ఇంకా రూ.10లక్షలు అప్సర కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 30 మంది సాక్ష్యులను కోర్టు ముందు హాజరు పరిచారు. ప్రేమించి, గర్భవతిని చేసిన పూజారి.. పెళ్లి మాటెత్తేసరికి అప్సరను కిరాతకంగా చంపి పూడ్చి పెట్టిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.