1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (11:14 IST)

గెలుపే టార్గెట్ - మంగళగిరిలో విస్తృతంగా లోకేశ్ పర్యటన.. తటస్థ ప్రముఖులతో భేటీలు

lokesh meeting
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేశ్ తాను పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ దఫా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల పార్టీ నేతలను కలుపుకుంటూ ముందుకు వెళుతున్నారు. అలాగే, తటస్థంగా ఉండే ప్రజలతో కూడా ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గత 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన లోకేశ్.. వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో రెండు మూడు నెలల్లో జరుగనున్న ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ నుంచే పోటీ చేయనున్నారు. ఇందుకోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. 
 
మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేశ్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజ లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా సోమేశ్వరరావులను లోకేశ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
 
తొలుత తాడేపల్లి 4వ వార్డులో నివసిస్తున్న దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులు యువనేతను సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సహకారం అవసరమని లోకేశ్ అన్నారు. మరో 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు.
 
అనంతరం తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన ప్రముఖ బీసీ నేత, శ్రీ ప్రతిభ స్కూలు అధినేత కాజ లక్ష్మీప్రసాద్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీసీల పుట్టినిల్లు అయిన తెలుగుదేశం పార్టీ ద్వారా బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు. జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని తెలిపారు. విలీనం పేరుతో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొల్లగొడుతూ పేదవిద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. మంగళగిరిని నెం.1గా మార్చే అభివృద్ధి ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని, ఇందుకు మీ వంతు సహకారం అందించాలని కోరారు.
 
తర్వాత తాడేపల్లి 23వ వార్డు మహానాడు కాలనీకి చెందిన బీసీ ప్రముఖుడు డాక్టర్ బుడ్డా సోమేశ్వరరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. సోమేశ్వరరావు ఆర్ఎంపీ డాక్టర్‌గా గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సేవలందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యసేవలను విస్తరించేందుకు మీవంటి వారి సహాయ, సహకారాలు అవసరమని లోకేశ్ తెలిపారు.
 
ఇప్పటికే ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలను ఏర్పాటుచేసి నియోజకవర్గవ్యాప్తంగా వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మంగళగిరి అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి మీ వంతు సహాయ, సహకారాలు అందించాలని లోకేశ్ చేశారు. రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.