1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (12:39 IST)

బీఆర్ఎస్‌కు మరో షాక్ : కాంగ్రెస్ గూటికి చేరనున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

pocharam
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి మరో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన భారాసకు టాటా చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్‌ పార్టీలోకి స్వయంగా ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
 
అంతకుముందు రేవంత్‌కు పోచారం శ్రీనివాసరెడ్డి శాలువా కప్పి స్వాగతం పలికారు. మరోవైపు భారాస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరికొందరు ఆ పార్టీ నేతలు పోచారం ఇంటికి వెళ్లారు. సీఎం రేవంత్‌ రెడ్డి అక్కడ ఉన్న సమయంలోనే నిరసనకు దిగారు. ఈ క్రమంలో భారాస, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో బాల్క సుమన్‌, భారాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
కుప్పం పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు...ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు... 
 
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26వ తేదీల్లో కుప్పం నియోజవర్గానికి వెళ్లనున్నారు. మొత్తం రెండు రోజుల పాటు ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుప్పంలో పర్యటించనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
తన పర్యటనలో భగాంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను ఆయన కలుసుకుంటారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించిన టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సారి విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి వరుసగా, తనకు ఎదురులేని రీతిలో తన ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 
 
కొడాలి నానిపై వలంటీర్ల ఫిర్యాదు.. కేసు నమోదు..
 
వైకాపా ప్రభుత్వంలో బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు పలువురు వలంటీర్లపై వైకాపా నేతలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయించిన విషయం తెల్సిందే. ఇలాంటి వారంతా మళ్ళీ తమను విధుల్లోకి చేర్చకోవాలని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి ప్రాధేయపడుతున్నారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వలంటీర్లు బిక్కమొహం వేస్తున్నారు. అంతేకాకుండా, ఒత్తిడి చేయించి రాజీనామాలు చేయించిన వారిపై ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు సలహాలు ఇస్తున్నారు. 
 
దీంతో అనేకమంది వలంటీర్లు వైకాపా నేతలపై ఫిర్యాదులు చేస్తున్నారు. తమను వేదించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైకాపా అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్రు వైకాపా నేతలపై 447, 506 సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.