శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!
హైదరాబాద్ నగరంలోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అతితెలివి ప్రదర్శించాడు. తాను లంచాల రూపంలో తీసుకునే డబ్బును చెత్త డబ్బాలో వేసి, ఇంటికి వెళుతూ వెళుతూ దాన్ని తీసుకెళ్లేవాడు. ఈ విషయం పసిగట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) మాటు వేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు...
ఈ నెల 15వ తేదీన శామీర్‌పేట పరిధిలో ఓ కిరాణా దుకాణానికి తీసుకొస్తున్న వాహనం నుంచి రూ.2.42 లక్షల విలువైన నూనె డబ్బాల చోరీ జరిగినట్టు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, సూర్య, అఖిలేశ్‌లు ఈ చోరీకి పాల్పడినట్టు నిర్ధారించి, వారిద్దరిని ఈ నెల 15వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించే క్రమంలో మరో వ్యక్తి ఈ నూనె డబ్బాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
ఈ కేసును విచారిస్తున్న శామీర్‌పేట్ ఎస్ఐ ఎం పరశురాం... నూనె డబ్బాలు కొనుగోలు చేసిన వ్యక్తిని ఈ నెల 20వ తేదీకి ఠాణాకు పిలిచి, కేసు నుంచి తప్పించుకోవాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన బాధితుడు మరుసటిరోజు రూ.2 లక్షలు తీసుకొచ్చి ఎస్ఐ కారులో పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎస్ఐ మరోమారు కాల్ చేసి రూ.2 లక్షల్లో రూ.25 వేలు తక్కువగా ఉందని, ఆ సొమ్ము కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు బాధితుడు రూ.22 వేలు ఇచ్చేందుకు సమ్మతించాడు.
ఆ తర్వాత ఎస్ఐ నుంచి వేధింపులు పెరగడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ బయట మాటువేసి, బాధితుడుని డబ్బుతో లోపలికి పంపించారు. ఎస్ఐ దగ్గరకు వెళ్ళిన బాధితుడు.. రూ.22 వేలు తీసుకొచ్చామని చెప్పగా, టేబుల్ పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేసి వెళ్లిపోవాలని చెప్పడంతో బాధితుడు కూడా అలానే చేశాడు. ఆ తర్వాత ఎస్ఐ పరశురాం డబ్బులు తీసి లెక్కిస్తుండగా, ఏసీబీ అధికారులు రైడ్ చేసి పరశురాంమ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.