ఆదివారం, 23 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 మార్చి 2025 (16:45 IST)

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

road accident
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న ఓ విద్యార్థిని మృత్యువాతపడింది. ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఆమె అన్నకు కూడా గాయాలయ్యాయి. మృతురాలిని ప్రభాతి ఛత్రియ (16)గాను, క్షతగాత్రుడుని ఆమె అన్న సుమన్ ఛత్రియగా గుర్తించారు. 
 
పదో తరగతి పరీక్ష రాసిన తన చెల్లి ప్రభాతిని తీసుకుని ద్విచక్రవాహనంపై సుమన్ ఇంటికి బయలుదేరాడు. వీరి బైకు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై వస్తుండగా అదుపుతప్పి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సును ఢీకొట్టి కిందపడింది. ఈ ఘటనపై ప్రభాతిపై బస్సు చక్రాలు ఎక్కడంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. పరీక్ష రాసి ఇంటికి తిరుగుపయనమైన విద్యార్థిని అకాలమరణం చెందడంతో అక్కడే ఉన్న పాదాచారులు, ఇతర ద్విచక్రవాహనదారులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదం మరోమారు ద్విచక్రవాహనదారుల భద్రతపై పలు సందేహాలు రేపుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రభాతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.