వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి
వీధి కుక్కల కాటుకి ఎంతోమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వాటి కాటుకి బలై ప్రాణాల కోసం పోరాడుతున్నారు. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలోని ఖాన్ కాలనీ మార్కెట్ యార్డులో వీధి కుక్కలు స్త్వైర విహారం చేసాయి. ఒకేసారి 9 మందిపై దాడి చేసి పాదాలను, పిక్కలను పీకాయి. దాంతో వారంతా రక్తమోడుతో బాధతో కేకలు వేస్తూ విలవిలలాడారు.
యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కోసం పరిగి ఆసుపత్రికి పరుగులు తీసారు. ఐతే అక్కడ ఆ మందు లభించకపోవడంతో అంతా కలిసి తాండూరు ఆసుపత్రికి వెళ్లారు. ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా కుక్కలు తండోపతండాలుగా పెరిగిపోయాయనీ, రాత్రివేళ లేదా మధ్యాహ్నం వేళ ఒంటరిగా వెళితే ఒక్కసారిగా కుక్కల దండు తమపై దాడి చేస్తున్నాయని వారు వాపోతున్నారు.
ఐతే వన్యప్రాణుల సంరక్షణ కోసం పోరాడేవారు మాత్రం ఒక్క వీధి కుక్కకి కూడా హాని చేయడాన్ని అంగీకరించబోమని నిరశనలు చేస్తున్నారు. కుక్క కాటుకి గురవుతున్న ప్రజలు మాత్రం.. మీరు అలా నిరశనలు చేసే బదులు వీధి కుక్కలన్నిటికీ మీ ఇళ్లకు తీసుకుని వెళ్లి వాటికి ఆశ్రయాలను ఏర్పాటు చేసి తిండి పెట్టండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీధి కుక్కల సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాల్సి వుంది.