మెడికల్ కాలేజీలో ర్యాగింగ్... జూనియర్లకు గుండుకొట్టిన సీనియర్లు
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓ వైద్య కాలేజీలో దారుణం జరిగింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్లకు గుండు కొట్టారు. ఈ జిల్లాలోని రామగుండం వైద్య కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ పేరుతో రెచ్చిపోయారు. అర్థరాత్రి జూనియర్ హాస్టల్ గదుల్లోకి చొరబడి వేధింపులకు గురిచేశారు. ఇద్దరు విద్యార్థులకు గుండుగొట్టి, మీసాలు తొలగించారు. దీంతో భయాందోళనకుగురైన ఆ విద్యార్థులు మరుసటిరోజు ఇంటికి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ల ఆగడాలతో విసిగిపోయిన జూనియర్ విద్యార్థులు మంగళవారం కాలేజీలో ఆందోళన చేపట్టారు. వైస్ ప్రిన్సిపాల్ చాంబర్ ముందు బైఠాయించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.
రామగుండం వైద్య కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతూ, కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు విద్యార్థుల గదుల్లోకి సోమవారం రాత్రి సీనియర్లు మూకుమ్మడిగా చొరబడ్డారు. జూనియర్లను ప్రశ్నలతో వేధిస్తున్నట్టు జుట్టు అంతలా ఎందుకు పెంచారని నిలదీశారు. అనంతరం ట్రిమ్మర్‌తో గుండు చేసి, మీసాలు తొలగించారు. వారితో పాటు ముగ్గురు విద్యార్థులను కూడా ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని ఫోనులో తమ తల్లిదండ్రులను వివరించిన బాధిత విద్యార్థులు ఉదయాన్నే ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేస్తున్న ఆగడాలతో విసిగిపోయిన జూనియర్ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.