శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (09:37 IST)

'ఆపరేషన్ రాజేందర్ ఓటమి' : రాజేందర్ పేరుతో నలుగురు అభ్యర్థులు

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి, తెరాస మాజీ నేత, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను చిత్తుగా ఓడించేందుకు అధికార తెరాస పార్టీ ఆపరేషన్ రాజేందర్ ఓటమికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, రాజేందర్ పేరుతో నలుగురు అభ్యర్థులు నామిషనేన్లు గుట్టుచప్పుడు కాకుండా దాఖలు చేశారు. ఇది రాజేందర్‌కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టేలావుంది. 
 
హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 30వ తేదీన బైపోల్ పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు నామిషన్ దాఖలు గడువు శుక్రవారంతో ముగిసింది. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. అలాగే, రాజేందర్ పేరుతో ఉన్న అభ్యర్థులు మరో నలుగురు ఉన్నారు. వీరి పేర్లు కూడా 'ఈ' అక్షరంతోనే ప్రారంభంకానున్నాయి. దీంతో ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనన్న ఆందోళన ఇప్పుడు బీజేపీ వర్గాల్లో మొదలైంది.
 
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ నుంచి ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ నుంచి ఇప్పలపల్లి రాజేందర్ పోటీలో ఉన్నారు. వీరందరూ శుక్రవారమే నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఈ నెల 7వ తేదీ వరకు 15 మంది నామినేషన్లు వేయగా, చివరి రోజైన నిన్న 46 మంది కలిపి మొత్తంగా 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు.