బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 7 అక్టోబరు 2021 (12:59 IST)

ఇసుక లారీలతో జర్నలిస్టులను తొక్కించేస్తారా? ఎంఎల్ఎ ద్వారంపూడి వ్యాఖ్యలపై నిరసన

జర్నలిస్టులపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నందిగామ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు గురువారం నందిగామ గాంధీ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం నందిగామ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు పఠాన్ మీరా హుస్సేన్ ఖాన్, షేక్ లాల్ మహమ్మద్ గౌస్ , వి.రవిశేఖర్, ఎవి  నారాయణ తదితరులు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక ,అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై బౌతిక దాడులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలను జర్నలిస్టులు ప్రశ్నిస్తుంటే, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అన్నారు.  
 
ఇసుక లారీలతో జర్నలిస్టులను తొక్కి చంపేయండి అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొనడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిందన్నారు. తక్షణమే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేసి  అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కనీస భద్రత కల్పించకపోతే ప్రభుత్వాలు మనుగడ కష్టం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో   జర్నలిస్టులు సైదాఖాన్ సత్యనారాయణ, శ్రీనివాస రావు, హమీద్ , సీతారాం పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.