ప్రియురాలు పిలిచె... ఆమె కోసం దొంగగా మారిన ధనవంతుడు
ప్రియురాలి మోజులో పడి దొంగగా మారిన ధనవంతుడు అనగానే.. ఇదేంటి అనుకుంటున్నారా..? కానీ... ఇది నిజంగా నిజం. హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న దొంగ బల్వీర్ సింగ్‌ను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అతడిని విచారిస్తే... తన ప్రియురాలి కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. నగరంలోని సుల్తాన్ బజార్‌లో గల బడిచౌడికి చెందిన బల్వీర్‌సింగ్ అలియాస్ బల్లు ఇంటి తాళాలు పగులకొట్టి చోరీలు చేయడంలో దిట్ట. పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కాగా డిగ్రీ వరకు చదువుకున్న బల్వీర్‌సింగ్ సంపన్న కుటంబానికి చెందినవాడు. ఎస్ఆర్ నగర్ లిమిట్స్‌లో మూడు దొంగతనాలు, రాయదుర్గం, పెట్ బషిరా బాడ్‌లో పలు దొంగతనాలకు పాల్పడేవాడు.
డిగ్రీ చదివిన బల్వీర్ సింగ్‌కు నగరంలోని కాచిగూడ ప్రాంతంలో నెలకు రూ.3 లక్షలు వరకు అద్దెలు వచ్చే భవనాలు ఉన్నాయి. ఐతే ప్రియురాలికి బహుమతులు ఇచ్చేందుకు ఆ డబ్బు కూడా చాలకపోవడంతో బల్వీర్‌సింగ్ దొంగగా మారాడు. అతడి ప్రియురాలు బెంగుళూరులోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఎంబీఎ చదువుతున్నట్లు సమాచారం.
కాగా ఇటీవల బల్కంపేట లోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల ఓ ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ప్రస్తుతం ఎస్సార్ నగర్ క్రైం పోలీసులు బల్వీర్ సింగ్‌ను పట్టుకున్నారు, దాదాపు 500 గ్రాముల గోల్డ్‌ను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. బల్లును మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు వెస్ట్ జోన్ డిసిపి ఏఆర్ శ్రీనివాస్.